Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై సర్కారు మల్లగుల్లాలు

తాజా వార్తలు

Published : 12/09/2021 17:11 IST

Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై సర్కారు మల్లగుల్లాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్‌ నిమజ్జనోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయంపై దృష్టిసారించలేదు. ఈ ఏడాది సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు స్పష్టమైన ఆంక్షలు విధించింది. దీంతో పరిస్థితి ఏంటనేదానిపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. మహానగరంలో గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాక 11వ రోజు పెద్దఎత్తున నిర్వహిస్తారు. నగరంలో చిన్నా, పెద్దా విగ్రహాలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో అధికం సాగర్‌కే వస్తుంటాయి. నగరవ్యాప్తంగా మరో 40 చెరువుల్లోనూ కలుపుతుంటారు.

హైకోర్టు ఏం చెప్పింది?
సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతిచ్చింది. అయితే, ట్యాంక్‌ బండ్‌ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి .. అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది.

ఏదీ ప్రత్యామ్నాయం!
సెప్టెంబరు 10న వినాయచవితి, 21వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించడంతో పరిస్థితి ఏంటన్నది అర్థం కావడంలేదు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ రూపొందించలేదు. కర్ణాటకలో విజయవంతమైన మినీ నిమజ్జన కొలనులను నగరంలో 150 చోట్ల నిర్మించాలని రెండేళ్ల కిందట నిర్ణయించి 30 మాత్రమే నిర్మించారు. మహానగరంలో 185 చెరువులున్నాయి. వాటి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అదీ లేదు. ‘ఈ ఏడాదికి పరిమితంగా అయినా సాగర్‌లో నిర్వహించి, వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తే సరిపోతుంది. ఈమేరకు హైకోర్టు అనుమతి తీసుకుంటే బాగుంటుంది. ఈ ఏడాది సాగర్‌లో నిమజ్జనాన్ని నిలిపేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బల్దియా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఇవాళ న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. హౌజ్ మోషన్‌కు అనుమతి నిరాకరించిన హైకోర్టు.. రేపు ఉదయం ప్రస్తావిస్తే లంచ్ మోషన్ విచారణకు పరిశీలిస్తామని తెలిపింది. 

హైకోర్టు పెద్ద మనసు చేసుకోవాలి: తలసాని

గణేశుడి విగ్రహాల నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమయం లేనందున హైకోర్టు పెద్ద మనసు చేసుకొని ఈ ఏడాదికి యథావిధిగా నిమజ్జనం చేసేలా అవకాశం కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను సర్కారు బాధ్యతగా తీసుకుంటుందన్న మంత్రి.. 48 గంటల్లో వ్యర్థాలు తీసేస్తామని తెలిపారు. వినాయక చవితి పండుగకి ఒక రోజు ముందు నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరిపోయాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని వివరించారు. హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందని.. హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ముందస్తు ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామని తలసాని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని