Dalit bandhu: అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 13/09/2021 22:14 IST

Dalit bandhu: అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: శాసనసభ సాక్షిగా దళిత బంధు పథకం రూపకల్పన జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి అనుభవాలను కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ముఖ్యమంత్రికి వివరించారు.

కొత్తగా మరో నాలుగు మండలాల్లో..

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులను పరిశీలిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు అమల్లో ఉన్న హుజూరాబాద్, వాసాలమర్రి మండలాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా అమలు చేయాలని నిర్ణయించిన మండలాలకు కూడా 2, 3 వారాల్లో దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీలను ఆర్థికంగా, వ్యాపార వర్గంగా నిలబెట్టాలని సంకల్పించినట్లు కేసీఆర్‌ వివరించారు. ఎస్సీ సాధికారత కింద అసెంబ్లీలో రూ.1000 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చానన్నారు. కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దళిత బంధు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళిత బంధుకు బడ్జెట్‌లో సైతం నిధులు కేటాయిస్తామన్నారు.

ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించడం లేదు..

అర్హులైన ఎస్సీలకు మైనింగ్‌ లీజులు, సివిల్‌ కాంట్రాక్టులు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మెడికల్‌, ఫర్టిలైజర్‌ దుకాణాలు, మీ సేవా కేంద్రాలు, గ్యాస్‌ డీలర్‌షిప్‌లు కేటాయిస్తామని తెలిపారు. దళిత బంధు కోసం లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండేలా చూస్తామన్నారు. గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో దళిత బంధు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. చాలా పథకాలు పెట్టి ఎస్సీలనే అభివృద్ధి చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించడం లేదని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో పథకం అమలు పటిష్టంగా జరగాలని.. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు, దళిత బంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం బ్యాంకు రుణం కాదన్నారు.

119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి: భట్టి

‘‘రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి. గిరిజనులకు కూడా ఈ తరహా పథకం తీసుకురావాలి.  ఇతర వర్గాల్లోని పేదలకూ ఈ పథకం అమలు చేయాలి. గత హామీల్లాగా దళిత బంధు మిగిలిపోవద్దు’’ అని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ఎంతో మంది సీఎంలను చూశాను: మోత్కుపల్లి

‘‘ఇప్పటివరకు ఎంతో మంది సీఎంలను చూశాను. ఎస్సీల కోసం ఇంత మంచి పథకం ఎవరూ ప్రవేశపెట్టలేదు. ఎస్సీలను ఆర్థిక దరిద్రం నుంచి దళితబంధు బయటపడేస్తుంది. ఈ తరహా పథకాలతో అంబేడ్కర్‌ ఆశయం నెరవేరుతుంది. ఈ పథకం దేశంలోనే ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. గత ప్రభుత్వాలు భిక్షమేసినట్లు చిన్నచిన్న సాయం చేశాయి. ఎస్సీలకు ఒకేసారి రూ.10 లక్షలు ఎవరూ ఇవ్వలేదు’’ అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

విప్లవాత్మక మార్పునకు దళితబంధు నాంది: గోరటి వెంకన్న

‘‘ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు దళితబంధు నాంది. ఎస్సీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక అడుగు వేశారు. దళితబంధుకు ఆగ్రకుల మేధావులు మద్దతివ్వాలి’’ అని వెంకన్న అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని