Rains: యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. భారీ వర్షాలపై అధికారులకు కేసీఆర్‌ ఆదేశం

తాజా వార్తలు

Updated : 22/07/2021 15:53 IST

Rains: యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. భారీ వర్షాలపై అధికారులకు కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆయన ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీటమునిగిందని.. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గోదావరి పరీవాహక ప్రాంత కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను సీఎం ఆదేశించారు.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేసీఆర్ సూచించారు. వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం చెప్పారు. ఆయా రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నాయని.. దీంతో రాష్ట్రంలోకి వరద ఉద్ధృతి పెరగనుందన్నారు. గోదావరి, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని.. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. అన్ని స్థాయిల్లోని తెరాస నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు సర్పంచ్ మొదలు మంత్రుల వరకు తెరాస నేతలు, కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నందున ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పిలుపు నిచ్చారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని