పుల్వామా దాడి ప్రధాన కుట్రదారు కాల్చివేత

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 05:37 IST

పుల్వామా దాడి ప్రధాన కుట్రదారు కాల్చివేత

 మృతుడు.. మసూద్‌ అజార్‌ మేనల్లుడు లంబూ

భద్రత బలగాల విజయం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా దాడి కేసులో దాదాపు రెండేళ్ల నుంచి వెతుకుతోన్న కరడుగట్టిన పాక్‌ ఉగ్రవాది మహ్మద్‌ ఇస్లామ్‌ అలియాస్‌ అబూ సైఫుల్లా అలియాస్‌ లంబూను మట్టుబెట్టాయి. శనివారం ఉదయం పుల్వామాలోని దాచీగామ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లంబూ సహా మరో ఉగ్రవాదిని హతమార్చాయి. లంబూ.. జైషే మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌ మేనల్లుడు. అంతేకాదు.. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వాహనశ్రేణిపై జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో ప్రధాన కుట్రదారుడు. అప్పటి నుంచి ఈ ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఉగ్రవాదిని సమీర్‌ దార్‌గా పోలీసులు గుర్తించారు. దార్‌ కూడా.. పుల్వామా కేసులో నిందితుడే. పుల్వామా దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 19 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో ఇప్పటివరకు 9 మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఎవరీ లంబూ

మహ్మద్‌ ఇస్లామ్‌ అలియాస్‌ లంబూ.. కశ్మీర్‌లో జైషే మహ్మద్‌ ప్రధాన కమాండర్‌. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. ఎత్తు ఎక్కువగా ఉండడంతో లంబూ అని పిలుస్తారు. పాక్‌లోని భావల్పూర్‌కు చెందిన ఈ ఉగ్రవాది ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడు. 2017లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటి నుంచి కశ్మీర్‌లో వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు నాయకత్వం వహించాడు. స్థానిక యువతకు ఐఈడీల తయారీలో శిక్షణ ఇచ్చాడు. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో లంబూ ప్రధాన నిందితుడు. ఆ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడి చేసిన అదిల్‌దార్‌కు లంబూయే పేలుడు పదార్థాల్లో శిక్షణ ఇచ్చాడు. చివరివరకు దార్‌తో సంబంధాలు కొనసాగించాడు. ఆ సందర్భంగా వైరల్‌ అయిన ఓ ఆడియో క్లిప్పులో గొంతు కూడా లంబూదే. దాడి తర్వాత దక్షిణ కశ్మీర్‌లో జరిగిన చాలా దాడుల్లో ఈ పాక్‌ ఉగ్రవాది హస్తం ఉంది. గతంలో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లతో కూడా కలిసి పనిచేశాడు. ఇటీవల కాలంలో పుల్వామాలోని వివిధ ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్నాడు.

15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో 15 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సోదాలు నిర్వహించింది. జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడితో పాటు.. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కొనసాగుతున్న లష్కరే ముస్తఫాపై నమోదైన కేసుకు సంబంధించి  శోపియా, అనంత్‌నాగ్‌, బనిహాల్‌, సుంజువాల్లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో  భారీ స్థాయిలో ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, తూటాలు, ప్లాస్టిక్‌ ముఖ మాస్కులు, జిహాదీ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. లష్కరే ముస్తఫాకు చెందిన ఉగ్రవాది ఇర్ఫాన్‌ అహ్మద్‌ను కూడా అరెస్టు చేశారు.

తప్పిన ఐఈడీ ముప్పు

జమ్ము-రాజౌరి హైవేలో భారీ ఉగ్ర కుట్రను సైన్యం భగ్నం చేసింది. హైవేలో ఓ వంతెన కింద ఉగ్రవాదులు పెట్టిన ఐఈడీ పేలుడు పదార్ధాన్ని గుర్తించి నిర్వీర్యం చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌ జిల్లా సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దును దాటే ప్రయత్నం చేసిన ఇద్దరు చొరబాటుదారులను సరిహద్దు భద్రతా బలగాలు కాల్చి చంపాయి. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. సరిహద్దు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించామని, వెనక్కి వెళ్లమంటూ పదే పదే హెచ్చరికలు జారీ చేసినా వారు పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపామని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన