Podu lands: నవంబరు 8 నుంచి పోడు దరఖాస్తులు

ప్రధానాంశాలు

Podu lands: నవంబరు 8 నుంచి పోడు దరఖాస్తులు

డిసెంబరు 8 వరకు స్వీకరణ

జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు

అడవులను ధ్వంసం చేస్తే పీడీ కేసులు

గంజాయి సాగు చేస్తే ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా రద్దు..అరెస్టు, జైలు

సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీభూముల్ని రక్షిస్తూ దట్టమైన అడవులుగా పునరుజ్జీవింపజేయాలి. అమాయకులైన గిరిజనులకు మేలుచేయడంతో పాటు అడవుల్ని నాశనం చేసే శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

పోడు భూముల సమస్య పరిష్కారానికి నవంబరు 8 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు గ్రామాలవారీగా గిరిజనులు, ఇతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. అంతకుముందే వివిధ స్థాయుల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అటవీ హక్కుల (ఆర్వోఎఫ్‌ఆర్‌) చట్టం ప్రకారం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు, మూడు గ్రామాలకు ఓ నోడల్‌ అధికారిని నియమించాలని.. గ్రామ, సబ్‌డివిజన్‌, ఆర్డీవో, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ ప్రక్రియను నవంబరు 1కల్లా పూర్తిచేయాలని కలెక్టర్లకు సూచించారు. అడవి మధ్యలో సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ భూములను కేటాయించాలని, అవి లేకుంటే అటవీప్రాంతానికి బయట భూమి ఇచ్చి నీళ్లు, విద్యుత్తు, నివాస సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈసారి ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద దరఖాస్తులు పరిష్కారమయ్యాక అటవీసంరక్షణకు కఠినచర్యలు తీసుకోవాలని.. ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీరక్షణ-పునరుజ్జీవంపై శనివారం ప్రగతిభవన్‌లో అటవీ, గిరిజన, పోలీసు, పంచాయతీరాజ్‌శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినా, ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని, భవిష్యత్‌ తరాలకు మేలు చేయాలంటే అడవుల్ని రక్షించుకోవాలని సూచించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే...

కోట్ల మొక్కలు నాటినా అడవితో సమానం కాదు

‘‘పదెకరాల అడవి లక్షల మొక్కలతో సమానం. సోషల్‌ ఫారెస్ట్‌లో ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అవి ఒక అడవితో సమానం కాదన్న విషయం గుర్తించాలి. 87 శాతం పోడు భూముల ఆక్రమణ.. కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌ వంటి 14 జిల్లాల్లోనే ఉంది.

బయటి శక్తులతోనే అడవి నాశనం

గోండు, కొలాం, కోయ వంటి గిరిజన తెగల వారు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బయటినుంచి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా అడవుల్ని ధ్వంసం చేస్తున్న శక్తులపై అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో గంజాయి సాగుచేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, విద్యుత్తు సౌకర్యం నిలిపివేయాలి. వారిని అరెస్టుచేసి జైలుకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలనూ రద్దుచేయాలి’’.. అని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2400 గ్రామాల్లోని అటవీ భూములు ఆక్రమణలకు గురైందని అటవీశాఖ వివరించినట్లు సమాచారం.


నాయకుల్లో ఏకాభ్రిపాయం తీసుకురావాలి

ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతో జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు పెట్టి పోడు పరిష్కారం, అటవీ భూముల రక్షణపై చర్చించాలి. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరులకు హక్కులు కల్పించాలి. ఆ తర్వాత అంగుళం అటవీభూమి కూడా ఆక్రమణకు గురికావద్దన్న విషయంలో అఖిలపక్షం నాయకుల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలి. గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని