CM KCR: గంజాయిపై ఉక్కుపాదం

ప్రధానాంశాలు

CM KCR: గంజాయిపై ఉక్కుపాదం

అది సాగు చేస్తే రైతుబంధు, బీమా బంద్‌
 ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో వేస్తే పట్టాలు రద్దు
 మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణ
 డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక విభాగం  
సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


తెలంగాణలో అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. తీవ్రవాదాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. దీనివల్ల రాష్ట్ర గౌరవం పెరిగింది. రాష్ట్రం ఇలా గొప్ప అభివృద్ధిని సాధిస్తుంటే... గంజాయి వంటి మాదకద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. ఈ పీడను త్వరగా తొలగించకపోతే సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పంటపొలాల్లో గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతు బీమా నిలిపివేత.. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) కింద పొందిన భూముల్లో పెంచితే పట్టాల రద్దు.. అంశాలను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. తమ గ్రామాల్లో గంజాయి సాగు వివరాలను సర్పంచులు ఆబ్కారీ అధికారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీలులేదని అన్నారు. దీని కోసం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని, విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా ఉంచాలని,  సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. నేరగాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ,  సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హోంశాఖ సలహాదారు అనురాగ్‌ శర్మ, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  ‘‘పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు అందుకొని సేవిస్తున్నారన్న నివేదికలు వస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ గంజాయి ఉత్పత్తి జరుగుతోంది. అక్కడి నుంచి  మన రాష్ట్రంలోకి ప్రవేశించి, ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతోంది. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా ఉన్నందున ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్‌ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరం. గతంలో పేకాట నిషేధం అమలైన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పేకాట ఆగిపోవాలి.

పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌..
మాదక ద్రవ్యాల వినియోగం ఎంత ప్రమాదకరమైనదో విద్యార్థి దశ నుంచే తెలిసేలా దేశపతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠాలను రూపొందించి సిలబస్‌లో చేరుస్తాం. మత్తుపదార్థాల దుష్ఫలితాలపై ప్రభావవంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. అద్భుతమైన రీతిలో షార్ట్‌ ఫిల్మ్‌లను, డాక్యుమెంటరీలను, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచారచిత్రాలను రూపొందించాలి. నేరగాళ్లకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా, కేసులు పకడ్బందీగా నమోదు చేయడానికి ప్రత్యేక న్యాయవాదులను నియమించుకోవాలి.

ఏం కావాలన్నా చేస్తాం
గంజాయి, మాదకద్రవ్యాల నిరోధానికి ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేస్తాం. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రత్యేక పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తాం. సమర్థంగా గంజాయి నియంత్రణ జరిగిన రాష్ట్రాల అనుభవాలను పరిశీంచాలి. గుడుంబా నిషేధాన్నీ సమర్థంగా అమలు చేస్తున్నాం. గుడుంబా తయారీదారులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది.’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలలో 99 శాతం మన దగ్గర భారీ పెట్టుబడులను పెడుతున్నాయి. పోలీస్‌శాఖ త్యాగాలు, వీరోచిత పోరాటం వల్లనే ఇది జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం వల్లనే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మాదక ద్రవ్యాల విషయంలో ప్రమాద ఘంటికలను  పోలీస్‌, ఆబ్కారీ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలి.

-సమీక్షలో సీఎం కేసీఆర్‌


 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని