Facebook: ‘ఫేస్‌బుక్క’వుతోంది!

ప్రధానాంశాలు

Facebook: ‘ఫేస్‌బుక్క’వుతోంది!

ప్రజాప్రయోజనాల కంటే లాభార్జనకే పెద్దపీట
అంతర్గత పరిశోధనల వివరాలు బయటపెట్టిన మాజీ ఉద్యోగి

శాన్‌ ఫ్రాన్సిస్కో, దుబాయ్‌: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్‌’ తాజాగా తీవ్ర ఇరకాటంలో పడింది! లాభార్జనకే ప్రాధాన్యమిస్తూ, ప్రజా ప్రయోజనాలను ఆ కంపెనీ పణంగా పెడుతోందని సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపించారు. చిన్నారులు, సమాజంపై తమ వేదిక చూపే ప్రతికూల ప్రభావాలు బయటకు తెలియకుండా దాచిపెడుతోందని విమర్శించారు. విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందనీ పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ అంతర్గత పరిశోధనలకు సంబంధించిన కీలక పత్రాలను బయటపెట్టారు. ‘ఫేస్‌బుక్‌ పత్రాలు’ పేరిట వెలుగుచూసిన ఈ పేపర్లు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం..

ప్రధానంగా అమెరికా, ఐరోపాలో అత్యంత కీలకమైన యువ వినియోగదారులను ఫేస్‌బుక్‌ వేగంగా కోల్పోతోంది. అక్కడి యువత ఈ సామాజిక మాధ్యమాన్ని ‘కాలం చెల్లిన నెట్‌వర్క్‌’గా చూస్తున్నారు. అందులోని సమాచారం తప్పుదోవ పట్టించేలా, వ్యతిరేకతను ప్రచారం చేసేలా ఉందని భావిస్తున్నారు. దీంతో ఇతర దేశాల్లో విస్తరించడంపై ఫేస్‌బుక్‌ ఇటీవల ఎక్కువగా దృష్టిసారించింది. అందులో విజయవంతమైంది. వినియోగదారుల సంఖ్యను భారీగా పెంచుకుంది. ఆయాచోట్ల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించడంలో మాత్రం విఫలమైంది. పలు భాషల్లో విద్వేష ప్రసంగాలు, బూటకపు సమాచారం వ్యాప్తి చెందకుండా నిలువరించలేకపోతోంది. ‘ఫేస్‌బుక్‌’ వేదికగా విద్వేష ప్రచారం ఎలా జరుగుతోందో.. వినియోగదారులకు ఏయే రూపాల్లో నష్టం వాటిల్లుతోందో.. కంపెనీకి బాగా తెలుసు. వాటికి సంబంధించి టన్నుల కొద్దీ సమాచారం ఉంది. నివారణ చర్యలు చేపట్టడంలో మాత్రం చురుగ్గా వ్యవహరించడం లేదు.

ఉద్యోగుల్లోనూ అసంతృప్తి!
లాభార్జనకు మొగ్గుచూపాలా? ప్రజల పక్షాన నిలబడాలా? అనే విషయంలో కంపెనీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. చిన్నారులకు ఫేస్‌బుక్‌ ఏ విధంగా హానికరంగా మారే ముప్పుంది? రాజకీయ హింసను పురిగొల్పేందుకు ఈ వేదిక ఎలా కారణమయ్యే అవకాశాలున్నాయి? వంటి ఎన్నెన్నో ప్రశ్నలతో ఫేస్‌బుక్‌ పరిశోధనలు నిర్వహించింది. సంబంధిత వివరాలు మాత్రం పెట్టుబడిదారులు, ప్రజల కంటపడకుండా దాచేస్తోంది. ప్రపంచాన్ని ఫేస్‌బుక్‌ మరింత మెరుగైన ప్రదేశంగా మారుస్తోందని తమ ఉద్యోగుల్లో ఎంతమంది భావిస్తున్నారో తెలుసుకునేందుకు ఆ సంస్థ తరచూ సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఒకప్పుడు కనీసం 70% మంది ఉద్యోగులు ఆ ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చేవారు. ఇటీవల అది 50 శాతానికి పడిపోయింది.

భాషా నిపుణుల కొరతతో..
ఫేస్‌బుక్‌లో విద్వేష ప్రచారం కొనసాగుతుండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి- స్థానిక భాషలకు సంబంధించి సంస్థలో నిపుణులు కొరవడటం. ఆయా భాషల్లో ప్రమాదకర అంశాలను గుర్తించగల కృత్రిమ మేధలను అభివృద్ధి చేయడంలోనూ ఫేస్‌బుక్‌ విఫలమైంది. కొన్ని అల్గోరిథమ్‌లు అందుబాటులో ఉన్నా.. వినియోగదారులు ఏ నేపథ్యంలో ఆయా పదాలను ఉపయోగించారో గుర్తించడంలో అవి విఫలమవుతున్నాయి. ఫలితంగా అఫ్గానిస్థాన్‌, మయన్మార్‌, సిరియా, పాలస్తీనా తదితర దేశాల్లో విద్వేష ప్రచారానికి సంస్థ అడ్డుకట్ట వేయలేకపోయింది. గాజా ఘర్షణలతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. ఫేస్‌బుక్‌ అధీనంలోని ఇన్‌స్టాగ్రాం సంస్థ ‘అల్‌అక్సా’ హ్యాష్‌ట్యాగ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. వాస్తవానికి అల్‌అక్సా మసీదు ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. తమ అల్గోరిథమ్‌లు ‘అల్‌అక్సా’ను ‘అల్‌-అక్సా మార్టయిర్స్‌ బ్రిగేడ్‌’ అనే ముష్కర సంస్థగా పొరబడ్డాయని, అందుకే నిషేధం విధించాల్సి వచ్చిందని వివరిస్తూ ‘ఫేస్‌బుక్‌’ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ప్రధానంగా అరబిక్‌ భాషకు సంబంధించి అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో అల్గోరిథమ్‌లు తరచూ విఫలమవుతున్నాయి.

మోదీ సర్కారుకు అనుకూలంగా..!
భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తోంది. విద్వేష ప్రసంగాలు, బూటకపు సమాచారానికి సంబంధించి.. ఎంపిక చేసిన పోస్టులపైనే కొరడా ఝళిపిస్తోంది. మరికొన్నింటిని వదిలేస్తోంది. ముఖ్యంగా ఓ వర్గంపై వ్యతిరేకత పెంచే అభ్యంతరకర పోస్టుల తొలగింపులో సంస్థ విఫలమైంది. ప్రధానంగా భాజపాతో సంబంధమున్న వ్యవహారాల్లో తలెత్తిన సమస్యలను సంస్థ పరిష్కరించలేకపోయింది.

ఏమిటీ ఫేస్‌బుక్‌ పత్రాలు?
ఫేస్‌బుక్‌ పలు సందర్భాల్లో నిర్వహించిన అంతర్గత పరిశోధనలకు సంబంధించిన వేల కొద్దీ పత్రాలు ఆ సంస్థ మాజీ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఫ్రాన్సెస్‌ హాగెన్‌ వద్ద ఉన్నాయి. ఆమె ప్రజావేగుగా మారి వాటిని బయటపెట్టారు. అమెరికా చట్టసభ- కాంగ్రెస్‌కు కూడా సమర్పించారు. వాటినే ఫేస్‌బుక్‌ పేపర్లుగా పిలుస్తున్నారు. ‘ది అసోసియేటెడ్‌ ప్రెస్‌’ సహా అమెరికాకు చెందిన 17 వార్తాసంస్థలు పరస్పర సహకారంతో ఈ పత్రాలను సేకరించి.. వాటిపై వరుస కథనాలను ప్రచురిస్తున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని