Natural Gas: ప్రపంచం నెత్తిన వాయుగండం!

ప్రధానాంశాలు

Natural Gas: ప్రపంచం నెత్తిన వాయుగండం!

తగ్గిపోయిన సహజవాయువు సరఫరా

అనేక దేశాలపై పెనుభారం.. విద్యుదుత్పత్తిపై ప్రభావం

మాస్కో: కరోనా భూతం కోరల నుంచి బయటపడేందుకు అగచాట్లు పడుతున్న ప్రపంచ దేశాలను ఇంధన కొరత వేధిస్తోంది. ఆర్థిక వ్యవస్థలను నడిపించడానికి కీలకమైన సహజవాయువు, చమురు, ఇతర ఇంధనాల లభ్యత భారీగా పడిపోవడంతో అనేక దేశాలు కుదేలవుతున్నాయి. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఎరువుల ఉత్పత్తి ఆగిపోయింది. అనేకచోట్ల కరెంటు బిల్లుల మోత మోగుతోంది. ముంచుకొస్తున్న శీతాకాలం మరింత భయపెడుతోంది. తీవ్ర చలిగాలుల నుంచి రక్షించే ఉష్ణ యంత్రాల వినియోగం పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఇంధన కొరతకు మరిన్ని రెక్కలు రావొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


పరిశ్రమలకు ధరల సెగ

* ఇంధన కొరతతో ఇటలీలో గోధుమ, మొక్కజొన్నను ప్రాసెస్‌ చేయడానికి అయ్యే వ్యయం 600 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. గోధుమలను పిండిగా మార్చడం, మొక్కజొన్నలతో పశువుల దాణా తయారుచేయడం వంటివి ఇందులో ఉన్నాయి. మీథేన్‌ వాయువు ధర ఆరు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ధాన్యాలను ఎండబెట్టడానికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరగనుంది. ఈ అధిక ధరల సెగ బ్రెడ్‌, పాస్తా ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. పాడి, మాంసం పరిశ్రమలపై దీని ప్రభావం పడుతుంది. అంతిమంగా ఈ ధరలను వినియోగదారులు మోయాల్సిందే.

* ఐరోపాలోని గ్యాస్‌ ఆధారిత కర్మాగారాలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఎరువుల్లో కీలకమైన అమ్మోనియా ఉత్పత్తిపై జర్మనీ రసాయన కంపెనీలు కోత విధించాయి. దీంతో ఎరువులకు కొరత ఏర్పడుతోంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

* చైనాలో బొగ్గు, గ్యాస్‌ ధరలు పెరగడంతో విద్యుదుత్పత్తిపై ఆ ప్రభావం పడింది. కరెంటుకు డిమాండ్‌ బాగా పెరిగింది. విద్యుత్‌ సరఫరాలేక అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో చాలా దేశాల్లో క్రిస్మస్‌ షాపింగ్‌ సీజన్‌కు ముందు వస్తువుల సరఫరాకు కొరత ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

* 91 ఏళ్లలో ఎన్నడూ లేని కరవు కోరల్లో చిక్కిన బ్రెజిల్‌కు గ్యాస్‌, ఇంధన ధరలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. అక్కడ జలవిద్యుత్‌ కేంద్రాలు నిలిచిపోయాయి. కరెంటు ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో ఉన్న కొద్దిపాటు డబ్బుతో అటు ఆహారం కొనుగోలు చేయలేక.. ఇటు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక ప్రజలు అవస్థపడుతున్నారు.

* అనేక దేశాల్లో ఈ శీతాకాలంలో విద్యుత్‌ బిల్లుల భారం పెరగొచ్చు. ఇంటిని వేడిగా ఉంచే ఉపకరణాల వినియోగం కారణంగా విద్యుత్‌ ఛార్జీలు ఏకంగా 54 శాతం మేర పెరిగే వీలుందని అమెరికాలో అధికారులు హెచ్చరించారు.


చలి తీవ్రంగా ఉంటే..

ఒకవేళ ఐరోపా, ఆసియాలో శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఐరోపాలో గ్యాస్‌ నిల్వలు సున్నా స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రష్యాను ఒప్పించుకొని, అదనపు గ్యాస్‌ సరఫరా జరిగేలా చూసుకుంటే తప్పించి ఐరోపాలో గండం గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.


ఎందుకీ దుస్థితి?

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడం మొదలుపెట్టడంతో గ్యాస్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో శీతాకాల నిల్వలు తగ్గిపోయాయి. రష్యాకు చెందిన గాజ్‌ప్రోమ్‌ సంస్థ.. ఐరోపాకు ప్రధాన సహజవాయు సరఫరాదారు. అయితే స్వదేశంలో శీతాకాలం కోసం అధిక నిల్వలు చేయాల్సి రావడంతో విదేశాలకు సరఫరా చేయలేకపోయింది. దీనికితోడు సహజవాయువు ధరలు గత కొద్దినెలల్లో ఐదు రెట్లు పెరిగాయి.

* చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌లలో గ్యాస్‌కు డిమాండ్‌ పెరగడం కూడా ఈ ఇంధన ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది.

* మరోవైపు పీపా ముడిచమురు ధర దాదాపు 85 డాలర్లకు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్ఠ స్థాయి. మహమ్మారి సమయంలో ఉత్పత్తికి కోత పెట్టిన చమురు ఎగుమతి దేశాల కూటమి ‘ఒపెక్‌’.. తన ఉత్పాదకతను పునరుద్ధరించే విషయంలో ఆచితూచివ్యవహరించడమే ఇందుకు కారణం.

* గ్యాస్‌ ధరలు మరింత ప్రియం కావడంతో ఆసియాలో కొన్ని విద్యుదుత్పత్తి సంస్థలు చమురు ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లుతున్నాయి. దీంతో చమురు ధరలు మరింత పైకి ఎగబాకుతున్నాయి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని