KCR: అందరికీ బంధువవుతాం

ప్రధానాంశాలు

KCR: అందరికీ బంధువవుతాం

ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల సంపద పేదలకు పంచుతాం  
నర్సింహులు అణగారిన ప్రజల గొంతుక
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
తెరాసలో చేరిన మోత్కుపల్లి  


తెలంగాణ తెచ్చాక నేను పక్కకు జరుగుదామనుకున్నా.. అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందోనని కొందరు  ఆందోళన వ్యక్తం చేయడంతో నేనే పగ్గాలు చేపట్టా. ఏడ్చేటోడు ఎప్పుడూ ఏడుస్తుంటాడని లెక్క చేయకుండా తెలంగాణను ఓ దారిలో పెట్టా. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నామని, దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దయనీయస్థితిలో ఉన్న బలహీనవర్గాలను ఆదుకోడానికి తెచ్చిన ఈ పథకాన్ని, తన ప్రాణం పోయినా ఆపేది లేదన్నారు. ఒక్క దళితబంధుతోనే ఆగిపోబోమని, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు, ఈబీసీ, ఇతర వర్గాల పేదలకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధుకు రూ. 1.73 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, వచ్చే ఏడేళ్లలో ఇతర వర్గాలకు రూ. 23 లక్షల కోట్ల సంపద పంచుతామన్నారు. తెరాసకు రాజకీయం ఒక యజ్ఞమని, మిగతావాళ్లకు ఒక ఆట అని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని, ఒకసారి గెలుస్తుండొచ్చు, ఒకసారి ఓడుతుండొచ్చు కానీ తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కల్యాణలక్ష్మి వచ్చాక ఎవరైనా కట్నం అడిగితే దవడ వాచేలా కొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాసయే గెలుస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్‌లో తెరాసలో చేరారు. సీఎం ఆయనకు గులాబి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావని అన్నారు. నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించాం.


రాష్ట్రంలో ఎస్సీల వద్ద అతి తక్కువగా 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. జనాభాలో అత్యల్పంగా.. 9 శాతం ఉన్న ఎస్టీల వద్ద  22 లక్షల ఎకరాల భూమి ఉంది.


దళితబంధు యజ్ఞం

దళితబంధుకు రూ. 1.7 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ పెట్టుబడి రూ. 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది. వచ్చే ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుంది. అందులో రూ. 1.7 లక్షల కోట్లు పెద్ద ఖర్చుకాదు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. దళితబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుంటాయి. పథకాన్ని అవే అమలు చేస్తాయి.

ఎన్నికల కోసం కాదు

దళితబంధు ఆలోచన నాదే. దాన్ని ఎన్నికల కోసం తేలేదు. కొందరికి అవగాహన లేక గందరగోళం చేస్తున్నారు. ఇందులో పార్టీలు లేవు. రాజకీయాలు లేవు. దళితుడు అయితే సరిపోతుంది. దళితబంధును ఆరు నూరైనా ముందుకు తీసుకుపోతాం. బంతిలో కూర్చుంటే.. అందరికీ వంతు వస్తుంది. కులంతో పనిలేదు. పేదరికమే లెక్క. రెడ్డి, వెలమ, బ్రాహ్మణులలో పేదలు లేరా?


కల్యాణలక్ష్మి గురించి ఒకాయన నాతో మాట్లాడుతూ.. ‘కేసీఆరే లక్ష ఇస్తున్నారు. నువ్వేమి ఇస్తామని పెళ్లిచూపుల సందర్భంగా అడుగుతున్నారని’ తెలిపాడు. వాడి పళ్లు ఊడేలా దవడ మీద కొట్టమని చెప్పా.


మోత్కుపల్లికి తగినస్థాయి కల్పిస్తాం

మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి, అణగారిన ప్రజల గొంతుకగా ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం ఎన్నో ఏళ్లు కలిసి పనిచేశాం. మా స్నేహం రాజకీయాలకు అతీతమైంది. ఆయనకు కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడాను. రూ.కోటి ఖర్చయినా ఫర్వాలేదని చెప్పాను. దళితబంధు అమలుకు నిర్ణయించాక ఆయనకు ఫోన్‌ చేశాను. సమావేశాలకు మోత్కుపల్లి హాజరయ్యారు. రేపు యాదాద్రికి వెళ్తున్నాను. అక్కడికి కూడా ఆహ్వానించాను. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదు. ఏం సాధించామన్నదే ముఖ్యం. మోత్కుపల్లి సేవలను సద్వినియోగం చేసుకుంటాం’’ అని సీఎం అన్నారు.


తెలంగాణలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారమవుతున్నాయి. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి. మళ్లీ ఊళ్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణకు కావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అట్టడుగువర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి.


కేసీఆర్‌లాంటి సీఎంను చూడలేదు: మోత్కుపల్లి

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న సీఎం కేసీఆర్‌. ప్రజలకు కావాల్సింది పేదలను ఆదుకునే నాయకుడు. నా అనుభవంలో కేసీఆర్‌ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. దళితబంధు తెచ్చారు. రైతుబంధు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు తెచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం’’ అని అన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని