TRS Plenary: నవ నవోత్సాహం

ప్రధానాంశాలు

TRS Plenary: నవ నవోత్సాహం

తొమ్మిదోసారీ తెరాస అధ్యక్షునిగా కేసీఆర్‌ 

ప్లీనరీలో ఏకగ్రీవ ఎన్నిక   

అభినందనల వెల్లువ 

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీలో జరిగిన పార్టీ రాష్ట్ర ప్రతినిధుల తొమ్మిదో మహాసభలో ఎన్నికల రిటర్నింగు అధికారి శ్రీనివాస్‌రెడ్డి అధికారికంగా కేసీఆర్‌ ఎన్నికను ప్రకటించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో తెరాస ఆవిర్భవించింది. ఆ తర్వాత 2003, 05, 07, 09, 11, 13, 15, 18లలో జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన మహాసభలోనూ ఆయన ఎన్నికయ్యారు. కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షునిగా ప్రకటించిన వెంటనే ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్‌ ఎంపీ కవిత ఆయనకు తలపాగా తొడగగా.... మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆయనకు కత్తిని బహుకరించారు. 

కేసీఆర్‌ తెలంగాణలో పుట్టడం అదృష్టం
ఈ సందర్భంగా కేసీఆర్‌ను అభినందిస్తూ శాసనసభ మాజీ సభాపతి మధుసూధనాచారి ప్రవేశపెట్టగా, విప్‌ గొంగిడి సునీత బలపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ కారణజన్ముడని, ఆయన తెలంగాణలో పుట్టడం అదృష్టమని అన్నారు. కేసీఆర్‌ లాంటి నేత తెలంగాణకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని టీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ కె.కేశవరావు స్వాగతోపన్యాసంలో అన్నారు. ‘‘ఉద్యమం చేసిన నేతలు పాలనా పగ్గాలు చేపట్టడం అరుదు..ఈ ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి, తన మేధస్సుకు పదను పెట్టి తెలంగాణ దశ మారుస్తున్న సీఎం కేసీఆర్‌ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం అందరికీ గర్వ కారణం’’అన్నారు. 

ప్రవాసుల అభినందనలు
అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్‌కు తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త  మహేశ్‌ బిగాల ఆధ్వర్యంలో ప్రవాస సంఘాల ప్రతినిధులు కాసర్ల నాగేందర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.


అధ్యక్షుడు రాకపోతే కార్యనిర్వాహక అధ్యక్షుడి ఆధ్వర్యంలో సమావేశాలు 

పార్టీ నియమావళిలో మూడు సవరణలు 

రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి పార్టీ నియమావళిలో మూడు కీలక సవరణలను  ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టగా ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వాటి ప్రకారం ఇకపై పార్టీ అధ్యక్షుడు సమావేశాలకు హాజరుకాని పక్షంలో కార్యనిర్వాహక అధ్యక్షుడే అధ్యక్షత వహిస్తారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా, నియోజకవర్గాల కార్యవర్గాలను నియమించే అధికారం పార్టీ అధ్యక్షునికి ఉంటుంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ఇవి ఏర్పాటయ్యేవి. 


అధినేత పరిపాలనాదక్షుడు: హరీశ్‌రావు 

ఉద్యమ స్ఫూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండవర్గాలకు అందిస్తున్న పరిపాలనాదక్షుడు , దేశం గర్వించదగ్గ నేత మన కేసీఆర్‌ అని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కేసీఆర్‌కు హరీశ్‌రావు సోమవారం ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని