YS Sharmila: ఏడేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట

ప్రధానాంశాలు

YS Sharmila: ఏడేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట

తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా  
చేవెళ్ల సభలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు  
 ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్‌ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు. ఈ విధంగా సాగుతున్న కేసీఆర్‌ కుటుంబ పాలనను సమాప్తం చేయడానికే పాదయాత్ర చేస్తున్నా’’ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్య్ఖక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పేరిట బుధవారం చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన పాదయాత్రను తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ‘‘సరిగ్గా 18 ఏళ్ల కిందట సంక్షేమ పాలనకు పునాదులు వేసేలా వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. నా పాదయాత్రతో ప్రతి ఇంటి తలుపు తట్టి, కష్టాలు విని.. వాటిని తీర్చేలా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతిపక్షాల చేతకానితనాన్ని నిలదీస్తాం. వైఎస్‌ సంక్షేమ పాలనను తిరిగి తెస్తాం. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి.. మన పార్టీ లక్ష్యాలు’’ అని వివరించారు.

భాజపాను గంగలో ముంచుతా..కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతా..
‘‘ఈ ఏడేళ్లలో కేసీఆర్‌ను ప్రశ్నించే వారు లేరు కనుకే ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. దమ్ముంటే నాతోపాటు మీరూ(కేసీఆర్‌) పాదయాత్రకు రండి. సమస్యలు లేవు, పాలన అద్భుతమంటున్నారు కదా! నిజంగానే సమస్యలు లేవని నిరూపిస్తే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతా. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? మీ పాలన మీద నమ్మకం ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి. మీరు దేశంలో అధ్వానమైన సీఎం అని తాజాగా ఓ సర్వేలో తేలింది. మీకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఆలోచన లేదు. మీరు సీఎం అయ్యాక 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగితే.. అదే స్థాయిలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. మీ పాలనలో ఆరేళ్ల పసిపాపకూ  రక్షణ లేదంటే ఏమనుకోవాలి’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న భాజపాను గంగలో ముంచడానికి.. కేసీఆర్‌కు అమ్ముడుపోయి తెరాసకు వంత పాడుతున్న కాంగ్రెస్‌ను చీల్చి చెండాడటానికే యాత్ర చేపట్టా. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. ఆయనకు విశ్వసనీయత ఉందో.. మాకు ఉందో ప్రజలే తేలుస్తారు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.

మీ ఇజ్జత్‌ కాపాడే అస్త్రం షర్మిల: విజయమ్మ
వైఎస్‌ ఆశయాల సాధన కోసమే షర్మిల ప్రజల వద్దకు వస్తోందని విజయమ్మ అన్నారు. గతంలో ఆమె 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో కష్టాలు పడిందని అన్నారు. మీ ఇజ్జత్‌ కాపాడే అస్త్రంగా షర్మిలమ్మ వస్తోందన్నారు. కార్యక్రమంలో షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌, వైతెపా ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధులు తూడి దేవేందర్‌రెడ్డి, పిట్టం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు చేవెళ్ల పట్టణంలో ప్రారంభమైన యాత్ర.. దాదాపు తొమ్మిది కిలోమీటర్లు సాగింది. రాత్రి కందవాడ-నక్కలపల్లి మధ్యలో బస చేశారు. గురువారం నక్కలపల్లి నుంచి శంషాబాద్‌ మండలం కాచారంలోని వర్ధమాన్‌ కాలేజీ వరకు సాగనుంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని