కుప్పకూలిన పుదుచ్చేరి సర్కారు

ప్రధానాంశాలు

కుప్పకూలిన పుదుచ్చేరి సర్కారు

విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

ఈనాడు డిజిటల్‌, చెన్నై: పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విఫలమైందని సభాపతి శివకొళుందు ప్రకటించారు. అయితే, తీర్మానంపై ఓటింగ్‌ చేపట్టడానికి ముందుగానే అధికారపక్షం వాకౌట్‌ చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం నారాయణస్వామి, మంత్రులు రాజీనామా సమర్పించారు. ఆ లేఖను ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఈ-మెయిల్‌ ద్వారా పంపారు.
వరుస రాజీనామాలతో..
పుదుచ్చేరిలో 19 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌-డీఎంకే కూటమి నుంచి తర్వాత ఓ ఎమ్మెల్యే బహిష్కరణకు గురయ్యారు. ఇటీవల ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో బలం నిరూపించుకోవాలని సీఎంను లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆదేశించారు. విశ్వాస తీర్మానాన్ని సోమవారం నారాయణస్వామి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. ఎల్జీగా కిరణ్‌బేదీ ఉన్నప్పుడు తలెత్తిన సమస్యలు, ప్రతిపక్షాల కుట్రల నడుమ ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించామని నారాయణస్వామి అన్నారు. ఆయన వైఖరిని అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ ఖండించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విశ్వాసపరీక్షలో ముగ్గురు భాజపా నామినేటెడ్‌ సభ్యులకూ ఓటేసే అవకాశం కల్పించగా.. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో తీర్మానం వీగిపోయిందని, నారాయణస్వామి ప్రభుత్వం ఓడిపోయిందని సభాపతి పేర్కొన్నారు. అనంతరం ఎల్జీ తమిళిసైకి సీఎం నారాయణస్వామి, మంత్రులు రాజీనామా లేఖలు సమర్పించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని