ఆగస్టు 26 నుంచి జేఈఈ మెయిన్‌ చివరి విడత

ప్రధానాంశాలు

ఆగస్టు 26 నుంచి జేఈఈ మెయిన్‌ చివరి విడత

మూడో విడత తర్వాత నెల రోజుల వ్యవధి ఇచ్చిన కేంద్రం

దరఖాస్తు గడువు 20వ తేదీ వరకు పొడిగింపు

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబరు 26న!

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ చివరి విడత తేదీలు మారాయి. మూడో విడత తర్వాత నెల రోజుల వ్యవధి ఇచ్చి నిర్వహించనున్నారు. మూడో విడతను జులై 20 నుంచి 25వ తేదీ వరకు, చివరి విడతను జులై 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరుపుతామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. మూడో విడత పూర్తయిన రెండో రోజు నుంచే చివరి విడత పరీక్షలు జరపడం వల్ల తాము నష్టపోతామని, కొంత వ్యవధి ఇవ్వాలని విద్యార్థుల నుంచి డిమాండ్‌ వచ్చిందని.. అందుకే చివరి విడత పరీక్షలను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం వెల్లడించారు. ఇప్పటికే చివరి విడతకు 7.32 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. మూడో విడత పరీక్షలు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కాకుండా ఈ నెల 20, 22, 25, 27 తేదీల్లో జరుగుతాయని జాతీయ పరీక్షల మండలి బుధవారమే ప్రకటించింది. మెయిన్‌ చివరి విడత పరీక్షల తేదీలు మారిన నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబరు 26న జరిగే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పుర్‌ అధికారికంగా తేదీని వెల్లడించాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని