close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వచ్చే రెండు నెలలకు కార్యాచరణ

వైద్య పరీక్షల సామర్థ్యం  మరింత పెంచాలి
సీఎస్‌కు సూచించిన  కేంద్ర బృందం
రాజధానిలో పలు ప్రాంతాల్లో పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, గచ్చిబౌలి, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కేంద్ర బృందం సూచించింది. వైద్య పరీక్షల సామర్థ్యం పెంచడం, కరోనా బాధితులను కలిసిన వారిని గుర్తించడం (కాంటాక్ట్‌ ట్రేసింగ్‌), చికిత్స నిర్వహణ (క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌)పై మరింత దృష్టి సారించాలని కోరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. తొలుత గచ్చిబౌలి స్టేడియంలో టిమ్స్‌ను సందర్శించి అక్కడి ఐసోలేషన్‌ వార్డు, ఐసీయూ గదులను పరిశీలించారు. తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తదితరులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్యసేవలు, హోం క్వారంటైన్‌కు తరలించిన వారి వివరాలు, డిశ్ఛార్జి అయినవారు, మరణాల సంఖ్య, ఐసీయూలో ఉన్నవారి పరిస్థితిని తెలుసుకున్నారు. ముషీరాబాద్‌ డివిజన్‌ పఠాన్‌బస్తీలో పర్యటించిన బృంద సభ్యులు కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ధోబీ గల్లీ కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని 26 ఇళ్లను పరిశీలించారు. అక్కడ మరో నలుగురికి పరీక్షలు జరుపుతున్న తీరును తెలుసుకున్నారు.
రాష్ట్ర వైద్య అధికారులతో చర్చలు
పర్యటన ముగిశాక బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, కేంద్ర బృందం సభ్యులు సంజయ్‌ జాజు, రవీంద్రన్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణా, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. తొలుత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో పర్యవేక్షణ, నివారణ, ఆసుపత్రుల సన్నద్ధత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరస్‌ నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17,081 పడకలున్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4,489 అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయాల కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.