close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు?

అధిక బిల్లుల వసూళ్ల ఆసుపత్రుల అంశంలో సర్కారుకు హైకోర్టు ప్రశ్న
కరోనా చికిత్స ఛార్జీల జీవోను అవి అపహాస్యం చేస్తున్నాయని వ్యాఖ్య
ఈనాడు - హైదరాబాద్‌

కరోనా చికిత్సకు ఛార్జీలను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రైవేటు ఆస్పత్రులు అపహాస్యం చేస్తున్నాయని  హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సిందేనంది. ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఒకవేళ చర్యలు చేపట్టని పక్షంలో ఎందుకో చెప్పాలంది. కరోనా తీవ్రమవుతున్న వేళ విపత్తుల చట్టాన్ని, ఆస్పత్రుల (నమోదు, నియంత్రణ) చట్టాలను, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (వృత్తిపరమైన నైతిక నియమాలు)కు సంబంధించిన నిబంధనలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకిషన్‌ శర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో అధిక మొత్తాల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. కరోనా బాధితులకు అందించే చికిత్సకు వేసే బిల్లులపై పారదర్శకత పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పారదర్శకత అమలుకు మార్గదర్శకాలను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన ఆస్పత్రులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మీడియా నివేదికలను చూస్తుంటే ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఓ ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఓ సుల్తానా కరోనా చికిత్సకు రూ.1.5 లక్షలు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు (తుంబే) ఆస్పత్రి డిశ్ఛార్జి చేయలేదని పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఏజీని అడిగింది. కౌంటరు దాఖలుకు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ గడువు కోరడంతో ధర్మాసనం అనుమతిస్తూ.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలంటూ ఆదేశించింది.
నాలుగు ఆసుపత్రులకు నోటీసులు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులైన మెడికవర్‌ హాస్పిటల్స్‌, యశోద సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (సోమాజిగూడ), సన్‌షైన్‌ ఆస్పత్రి (సికింద్రాబాద్‌), కేర్‌ ఆస్పత్రి (బంజారాహిల్స్‌)లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
రేషన్‌కార్డు లేకున్నా సాయం అందేలా చూడండి
ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ట్రాన్స్‌జెండర్లతోపాటు రేషన్‌కార్డులేని వారికి సాయం అందించేలా చూడాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. కరోనా సమయంలో ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ఉచితంగా రేషన్‌తోపాటు కూరగాయలు, మందులు తదితరాలను అందించాలంటూ వైజయంతి వసంత మొగిలి అలియాస్‌ ఎం.విజయ్‌కుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది కొఠారి వాదనలు వినిపించారు. వాదనలను విన్న ధర్మాసనం ట్రాన్స్‌జెండర్లతోపాటు కార్డులేనివారందరికీ సాయం అందించే విషయంపై నివేదిక సమర్పించాలంటూ విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.


లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు విధాన నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించే పరిధి పరిమితమని పేర్కొంది. ఆర్థికపరమైన అంశాలతోపాటు ప్రజలకు జీవనోపాధి లేకపోవడం, వారిని బయటకు వెళ్లకుండా నియంత్రించడం ద్వారా వారికి ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిందని పేర్కొంది.
లాక్‌డౌన్‌ ఎత్తివేయడం వల్ల తీవ్రపరిణామాలు ఎదురవుతాయన్న పిటిషనర్‌ ఆందోళనను తోసిపుచ్చింది. ఏ ఒక్కరినీ ప్రార్థనా మందిరాలు, హోటళ్లకు వెళ్లాలంటూ ప్రభుత్వం బలవంతం చేయడంలేదన్న విషయాన్ని విస్మరించరాదంది. హెల్త్‌బులిటెన్‌ను విడుదల చేయడంతోపాటు పౌరులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోందని పేర్కొంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 76ను కొట్టివేయాలని, పారామిలటరీ బలగాలను దించి లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అప్పీలెట్‌ కోర్టుగా వ్యవహరించజాలబోమని, పరిస్థితులను సమీక్షించి దానికి అనుగుణంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సర్కారే సడలిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు కార్యనిర్వాహక వర్గం పరిధిలోనివని, ఇలాంటి నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినపుడు మాత్రమే జోక్యం చేసుకుంటాయంది. కొన్నిసార్లు ఈ విధాన నిర్ణయాలు అధికార పరిధిని దాటినట్లు కనిపిస్తుంటాయని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించనంతవరకు జోక్యం చేసుకోలేమంది. కార్యనిర్వాహక వర్గం అధికారాల్లోకి జొరబడలేమని, ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఉందని పేర్కొంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.