ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీల బొనాంజా

ప్రధానాంశాలు

ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీల బొనాంజా

తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్‌ రుసుం, రోడ్‌ టాక్స్‌ల నుంచి మినహాయింపు
ఎలక్ట్రిక్‌ పరిశ్రమలకూ ఇతోధిక తోడ్పాటు
కొత్త విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
పదేళ్ల పాటు అమలు
నేడు ఆవిష్కరించనున్న మంత్రులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొనుగోళ్లకు పలు రాయితీలను కల్పించింది. నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన సంస్థ (టీఎస్‌రెడ్‌కో)ను నియమించింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ గురువారం ఉత్తర్వులు (జీవో నెం.12)జారీ చేయగా.. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి పదేళ్ల కాలానికి తాజా విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.  రాష్ట్రాన్ని పెద్దఎత్తున వాహనాల తయారీ కేంద్రం(హబ్‌)గా తీర్చిదిద్దడం; ఇంధన నిల్వ పరికరాల ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టడం; రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ వాహనాల వృద్ధి, తయారీ, వాడకాన్ని ప్రోత్సహించడం; పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాల రూపకల్పన లక్ష్యంగా పేర్కొంది. విధానం అమలుకు ఉన్నతాధికారులతో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇది తరచూ సమీక్షలు నిర్వహిస్తుందని, నిర్ణీత కాల వ్యవధితో హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఛార్జింగ్‌ డిమాండు తీర్చడానికి కృషి చేస్తుందని తెలిపింది.
కొనేవారికి రాయితీలు ఇలా...
తెలంగాణలో కొత్తగా తయారై, కొనుగోలు జరిగే తొలి 2 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు; అలాగే మొదటి 20 వేల ఆటోలకు.. 5 వేల నాలుగు చక్రాల వాణిజ్య వాహనాలకు (కార్లు, టాక్సీ, టూరిస్టు క్యాబ్‌లకు).. 10 వేల తేలికపాటి (లైట్‌) గూడ్స్‌ వాహనాలకు.. 5 వేల కార్లకు.. 500 బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్‌ రుసుం, రోడ్డు పన్ను మినహాయింపు.
రాష్ట్రంలో కొనుగోలు చేసి, నమోదు చేసుకునే ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకూ రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం పూర్తి మినహాయింపు.
పారిశ్రామిక, లాజిస్టిక్స్‌, రవాణా కేంద్రాల పరిధిలో ప్రజా రవాణా వాహనాలు, ఈ-ఆటోలు, టాక్సీలకు రాత్రిపూట ఛార్జింగ్‌, పార్కింగ్‌ సౌకర్యం.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు...
రూ.200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని చేపట్టే భారీ పరిశ్రమలకు 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి సబ్సిడీ.. రూ.25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్ల పాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు.. అయిదేళ్ల పాటు రూ.5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్‌ రాయితీ.. రూ.50 లక్షల పరిమితితో అయిదేళ్ల పాటు పూర్తిగా విద్యుత్‌ రుసుం మినహాయింపు.. రూ.5 కోట్లకు తగ్గకుండా అయిదేళ్ల పాటు 60 శాతం రవాణా రుసుం, రూ.అయిదు కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ.
స్టాంపు, బదిలీ డ్యూటీలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు ఉండవు. లీజు అద్దె, పేటెంటు నమోదు రుసుం, నాణ్యత ధ్రువీకరణ, కాలుష్య రహిత ఉత్పత్తి, వాహనాల ప్రదర్శన, నైపుణ్యాభివృద్ధి రుసుంలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ-వాహన తయారీ, ఇంధననిల్వ సమూహాలకు ప్రోత్సాహం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రావిర్యాల, మహేశ్వరంలలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ సమూహాలను; దివిటిపల్లి వద్ద  ఇంధన నిల్వ తయారీ పరికరాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు, విద్యుత్‌, నీరు తదితర మౌలిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు షెడ్లు, ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కేంద్రం, ప్రదర్శన-అమ్మకం కేంద్రాలు, శిక్షణ, లాజిస్టిక్‌ సౌకర్యాలు కల్పిస్తుంది.
కొత్త రకం వాహనాల తయారీ కోసం పరిశోధన-అభివృద్ధి కేంద్రాల స్థాపన, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతిభా కేంద్రాలు, సాంకేతిక, పరిశోధన సంస్థల ఏర్పాటు. కేంద్రం నుంచి గ్రాంట్ల సమీకరణ, టీఫండ్‌ ద్వారా అంకురాలు, పరిశోధన, ఆవిష్కరణల సంస్థలకు ప్రోత్సాహం, టీవర్క్స్‌ ద్వారా అంకురాలకు ఆలంబన.
బ్యాటరీలు, సెల్‌లు వాటికి సంబంధించిన పరికరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల అనుబంధ పరికరాల తయారీకి రాయితీలు, ముడిపదార్థాల సేకరణకు చర్యలు, గతంలో వాడిన బ్యాటరీలు, సెల్‌ల  పునర్వినియోగానికి, రీసైక్లింగుకి సాయం.
ఆటోలకు అదనంగా ఫిట్‌మెంట్‌ రాయితీ కింద మొదటి అయిదువేల తయారీకి రూ.15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ. తక్కువ వడ్డీతో వాటికి రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు.
ఛార్జింగ్‌ సౌకర్యాలు
ఛార్జింగ్‌ సదుపాయాల కోసం కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కోసం చర్యలు. హైదరాబాద్‌, ఇతర నగరాలు, పట్టణాల్లో కేంద్రాల స్థాపన. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ)ద్వారా ఛార్జింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక విద్యుత్‌ ఛార్జీలు.
రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన సంస్థ (రెడ్‌కో) ఛార్జింగ్‌ కేంద్రాల స్థాపనకు కృషి చేస్తుంది. విమానాశ్రయాలు, రైల్వే, మెట్రో స్టేషన్లు, పార్కింగ్‌ స్థలాలు, బస్‌ డిపోలు, మార్కెట్లు, పెట్రోల్‌ డిపోలు, మాల్స్‌ తదితర ప్రాంతాల్లో వీటి స్థాపనకు లైసెన్స్‌దారులతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని, ప్రాంఛైజీలను ప్రోత్సహిస్తుంది. ఛార్జింగ్‌ కేంద్రాలకు కరెంటును, సౌర విద్యుత్‌ సరఫరాను సమన్వయం చేస్తుంది.
టౌన్‌షిప్‌లలో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
మహానగరాలకు వెళ్లే జాతీయ రహదారులపై ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక కేంద్రం ఏర్పాటు.
ఆర్టీసీ, మెట్రోరైలు సంస్థలు సైతం తమ డిపోల వద్ద ద్విచక్ర వాహనాల ఛార్జింగ్‌, పార్కింగ్‌ కేంద్రాల ఏర్పాటు.

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి గమ్యస్థానంగా తెలంగాణ: కేటీఆర్‌

లక్ట్రిక్‌ వాహనాల తయారీకి తెలంగాణ గమ్య స్థానంగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. అది హరితం, పర్యావరణహితంగా ఉంటుందని గురువారం ట్విటర్‌లో తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌లు శుక్రవారం ఉదయం 10.30కి హైదరాబాద్‌లో జరిగే ఎలక్ట్రిక్‌ వాహనాల శిఖరాగ్ర సదస్సులో కొత్త విధానాన్ని ఆవిష్కరిస్తారు. ‘పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం’ అనే అంశంపై  జరిగే దృశ్యమాధ్యమ సదస్సులో మంత్రులతో పాటు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తదితరులు పాల్గొంటారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని