
ప్రధానాంశాలు
పండగ రోజు రైతుల నిరసన
దిల్లీ/చండీగఢ్/అమృత్సర్: కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులు ఆ చట్టాల ప్రతులను బుధవారం భోగి మంటల్లో దహనం చేశారు. దేశవ్యాప్తంగా చేసుకొనే పంటల పండగ సంక్రాంతిని తమ నిరసనలకు వేదికగా మలుచుకున్నారు. ఉత్తర భారతదేశంలో సంక్రాంతిని లోహ్రి, బిహూ, పొకి పేరిట చేసుకొంటారు. ఉద్యమ ప్రధాన కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులోని దీక్షా శిబిరాల్లోనే దాదాపు లక్ష ప్రతులను ఆ మంటల్లో వేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత పరంజిత్ సింగ్ తెలిపారు. చట్టాలను రద్దు చేసిన తర్వాతే పండగ చేసుకుంటామన్నారు. దిల్లీలోని ఉద్యమ శిబిరాలతో పాటు పంజాబ్, హరియాణా, పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘ఈ రోజు మేం ఈ చట్టాల ప్రతులను తగులబెట్టాం. రేపు కేంద్ర ప్రభుత్వమే వాటిని దహనం చేస్తుంది. చేయక తప్పదు’’ అని రజ్బీర్ సింగ్(34) అనే రైతు వ్యాఖ్యానించారు. రైతు నేతలు యోగీందర్ యాదవ్, గుర్నామ్‌సింగ్ తదితరులు చట్టాల ప్రతుల దహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ట్రాక్టర్ల కవాతుకు పిలుపు
ఈ నెల 26న నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతుకు దిల్లీకి 300 కి.మీ.దూరం లోపల ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ సంఘం పిలుపునిచ్చింది. గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే దిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని తెలిపింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ముందు హాజరుకారాదని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. సింఘు, టిక్రీ, గాజీపుర్‌లలో కొనసాగుతున్న రైతుల ఉద్యమం చిరువ్యాపారులకు ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు సాగక నష్టపోయిన పలువురు.. ఆదాయం కోసం సరికొత్త మార్గాలను ఎంచుకున్నారు. దీక్షా శిబిరాల వద్ద ఉంటున్న ఆందోళనకారులకు, సంఘీభావంగా అక్కడకు వచ్చే వారికి ‘ఐ లవ్ కిసాన్’, ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ వంటి నినాదాలు రాసిన బ్యాడ్జీలను, స్టిక్కర్లను విక్రయిస్తున్నారు.
దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కేంద్రం: కాంగ్రెస్
కొత్త సాగు చట్టాల విషయంలో దేశ ప్రజలను, సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. చట్టసభల్లో ముందస్తు సంప్రదింపులు జరిపిన తర్వాతే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతున్న మాటలు వాస్తవంకాదన్నారు.
ఖలిస్థాన్ జెండా ఎగురవేత పిలుపు విద్రోహ చర్యే: కైలాశ్ చౌధరీ
దిల్లీ: గణతంత్ర దినోత్సం రోజున ఖలిస్థాన్ జెండా ఎగురవేసిన వారికి నగదును బహూకరిస్తామంటూ నిషేధిత సంస్థ ‘సిఖ్ ఫర్ జస్టిస్’ ప్రకటించడంపై కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిలుపునిచ్చే వ్యక్తులు దేశ విద్రోహులేనని పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థను గౌరవించండి: బీసీఐ
కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినందున న్యాయవ్యవస్థను గౌరవిస్తూ రైతులు తమ ఆందోళనలను విరమించుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. దేశ ప్రయోజనాల రీత్యా, రైతుల ప్రాణాలు కాపాడడం కోసం సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని బీసీఐ ఛైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏఎంయూ విద్యార్థుల వైద్య శిబిరం
అలీగఢ్: దిల్లీ సరిహద్దుల్లో 50 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావంగా వైద్య శిబిరం, గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ(ఏఎంయు) విద్యార్థుల సమన్వయ కమిటీ వెల్లడించింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!