
ప్రధానాంశాలు
11 మందిలో స్వల్ప దుష్ఫలితాలు
అత్యధికుల హాజరుతో అపోహలకు అడ్డుకట్ట
గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు తొలి టీకా
‘గాంధీ’లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, ఈటల
నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై.. తిలక్‌నగర్, నార్సింగిలో మంత్రులు కేటీఆర్, సబిత
వైద్యవిద్య సంచాలకులు సహా పలువురు ఉన్నతాధికారులకూ వ్యాక్సిన్
ఈనాడు- హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ టీకా ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు లక్షిత లబ్ధిదారుల్లో 92.22 శాతం మంది టీకాలను పొందారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 140 కేంద్రాల్లో 4,296 మందికి టీకాలివ్వాలన్నది లక్ష్యం కాగా, 3,962 మందికి టీకా వేశారు. అత్యధికులు టీకాలు పొందడంతో అపోహలకు అడ్డుకట్ట పడిందని, ఈ స్ఫూర్తితో మిగిలిన లబ్ధిదారులూ ముందుకొస్తారని వైద్య ఆరోగ్యశాఖ విశ్వసిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు తొలిటీకా వేశారు. నార్సింగి గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం జయమ్మకు మొదటి టీకా వేశారు. తొలిరోజు టీకాలు పొందిన ప్రముఖుల్లో వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంచాలకులు డాక్టర్ శంకర్, టిమ్స్ సంచాలకులు డాక్టర్ విమలా థామస్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్యకళాశాల సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ తదితరులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీకాలు తీసుకున్న 11 మందిలో నొప్పి, దద్దుర్లు, ఎర్రబడడం, జ్వరం, కళ్లు తిరగడం, చెమట పట్టడం వంటి స్వల్ప దుష్ఫలితాలు కనిపించినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఎవరిలోనూ తీవ్ర ప్రభావం లేదని, వైద్యసిబ్బంది, ప్రజలు భయాందోళనలు లేకుండా టీకాలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ఆరోగ్య కార్యకర్తకు టీకా వేయించుకున్న తర్వాత బీపీ పెరిగింది. మధ్యాహ్నం 1.25 గంటలకు టీకా పొందగా.. 2.30 గంటలకు బీపీ పెరగడం, వాంతులవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆమెను వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆమెకు భయం కారణంగా ఈ సమస్యలు తలెత్తాయని, టీకా దుష్ప్రభావం కాదని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి తెలిపారు.
ఉదయం నుంచే సందడి
రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 140 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచే సందడి మొదలైంది. టీకా పంపిణీ కేంద్రాలను పూలదండలు, ముగ్గులతో అలంకరించారు. ప్రధానమంత్రి మోదీ ప్రసంగానికి ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, వైద్యసిబ్బంది, లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రసంగాన్ని తిలకించడానికి అన్ని చోట్లా టీవీలను ఏర్పాటు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన మోదీ ప్రసంగాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గాంధీ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీకాల పంపిణీని ప్రారంభించారు. టీకా పొందుతున్న వారిని, అందజేస్తున్న సిబ్బందిని కేటీఆర్ అభినందించారు. రాష్ట్రమంతటా దాదాపు ఉదయం 11- 11.15 గంటల్లోపు పంపిణీకి శ్రీకారం చుట్టారు. కొన్ని చోట్ల కొవిన్ యాప్‌లో లబ్ధిదారుల సమాచారం నమోదులో ఇబ్బందులెదురవడంతో విడిగా ఆఫ్‌లైన్‌లో సమాచారాన్ని పొందుపరిచారు. గాంధీ ఆసుపత్రి, నార్సింగిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో వైద్యసిబ్బంది, లబ్ధిదారులతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమంలో మాట్లాడతారని ముందుగా సమాచారమివ్వడంతో.. ఆయా కేంద్రాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ప్రధానమంత్రి వారితో సంభాషించలేదు.
రేపటి నుంచి 500 కేంద్రాల్లో..
సోమవారం నుంచి టీకా పంపిణీ కేంద్రాలను 500కు, ఒక్కో కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్యను 50కి పెంచనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వచ్చే 7-10 రోజుల్లో 1213 కేంద్రాలకు పంపిణీని విస్తరించి, రోజుకు గరిష్ఠంగా 100 మందికి టీకాలివ్వడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరో 7-10 రోజుల తర్వాత 179 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పంపిణీ ప్రారంభించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రెండోవిడత టీకాలు రాష్ట్రానికి చేరాక, ప్రైవేటులో పంపిణీ మొదలవుతుందని ఒక ఉన్నతాధికారి చెప్పారు.
గర్భిణికి టీకా ఇవ్వబోయిన సిబ్బంది...
అధికారులపై ఉప్పల్ ఎమ్మెల్యే ఆగ్రహం
మేడ్చల్ జిల్లా పరిధి మల్లాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొరపాటున ఒక గర్భిణికి టీకా ఇచ్చేందుకు సిద్ధమవడం విమర్శలకు దారితీసింది. మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త శ్రీలత పేరును జాబితాలో చేర్చడంతో టీకా తీసుకునేందుకు ఆమె వచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ఆ మహిళను ఆరోగ్య పరిస్థితితో పాటు ఎంతమంది పిల్లలు ఉన్నారంటూ వాకబు చేశారు. తాను 3 నెలల గర్భిణిని అంటూ ఆమె చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. గర్భిణులకు టీకా వేయద్దంటూ స్పష్టమైన ఆదేశాలున్నా జాబితాలో ఆమె పేరును ఎలా నమోదు చేస్తారంటూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
కొండంత ధైర్యం..
హైదరాబాద్ కేంద్రంగా టీకాను రూపొందించిన భారత్ బయోటెక్ పరిశోధనశాలను ప్రధాని మోదీ స్వయంగా సందర్శించి శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపారు. 2021 ప్రారంభమే టీకా రూపంలో కొండంత ధైర్యాన్ని మోసుకొచ్చింది. భారత్‌లో తయారైన టీకాలపై ఎలాంటి అపోహలు అక్కర్లేదు.- తమిళిసై, రాష్ట్ర గవర్నర్
ప్రపంచం చూపు... భారత్ వైపు
కొవిడ్ టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా కొవాగ్జిన్‌తో రాష్ట్ర సత్తా ప్రపంచానికి తెలిసింది. వ్యాక్సిన్‌పై కొన్ని పార్టీలు, సంస్థలు రాజకీయం చేయడం తగదు.- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
నేను ముందుగా టీకా తీసుకుంటే విమర్శలొస్తాయి
కరోనా వ్యాక్సిన్ తయారీతో తెలంగాణకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌లో తయారు కావడం గర్వకారణం. అపోహలు, భయాందోళనలు దూరం చేసేలా నేనే మొదటగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కానీ విమర్శలొస్తాయి.- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
ఇది నిరంతర ప్రక్రియ
వ్యాక్సిన్ అనేది నిరంతర ప్రక్రియ. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేశారు. అందుకే మొదటి టీకా వారికి అందించాం. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వాలన్న ప్రధానమంత్రి సూచన మేరకే తొలివిడతలో నేను టీకా తీసుకోలేదు.- ఈటల రాజేందర్,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
రాష్ట్రానికి మరిన్ని డోసులు ఇవ్వాలి
కేంద్రానికి రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి
కరోనాను అంతం చేద్దాం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ శనివారం రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖల మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. టీకా పంపిణీలో సాఫ్ట్వేర్ సమస్యలను ప్రస్తావించి, ప్రక్రియను సరళతరం చేయాలని ఆయన సూచించారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ దేశమంతా సమష్టిగా పనిచేసి పోలియోను పారదోలిందని, అలాగే కరోనాను కూడా అంతం చేద్దామని అన్నారు. ప్రధాని మంత్రి నిర్ణయం మేరకు ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇస్తున్నామని తెలిపారు. ‘చాలా మంది నన్ను వ్యాక్సిన్ తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారని, 50 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చే సమయంలో తాను తీసుకుంటా’నని హర్షవర్ధన్ తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- నమ్మించి మోసం చేశారు: జయలలిత
- ఆలుమగల మధ్య అమెరికా చిచ్చు
- కీరన్ పొలార్డ్ మెరుపులు.. 6 X 6
- వంటకు ఏ నూనె మంచిది...
- నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
- అలా చేస్తే రూ. 75కే లీటర్ పెట్రోల్
- శశికళ సంచలన నిర్ణయం
- నిండా మునిగిన షావుకారు!
- పోలీసులే కీచకులయ్యారు!
- కరోనా: ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోంది