13 నుంచి వైద్య సిబ్బందికి రెండో డోసు

ప్రధానాంశాలు

13 నుంచి వైద్య సిబ్బందికి రెండో డోసు

6 నుంచి రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, పురపాలక సిబ్బందికి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈనెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో డోసు కొవిడ్‌ టీకా వేయనున్నారు. గత నెల 16 నుంచి తొలి డోసు పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు వేయడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం 11,547 మంది ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా వేశారు. ఈ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 288 పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేసి, 26,056 మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 44.3 శాతం మంది వేయించుకున్నారు. వీరిలో నలుగురిలో స్వల్ప దుష్ఫలితాలు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బంది కొవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటి వరకూ టీకా తీసుకోకుంటే అటువంటి వారు శనివారం వేయించుకోవాలని సూచించారు. తొలి డోసు తీసుకోడానికి ఇదే ఆఖరి అవకాశమని వివరించారు. ఈనెల 6 నుంచి 12 వరకూ రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, పురపాలక సిబ్బందికి వేయనున్నట్లు తెలిపారు. ఈ కేటగిరీల్లో సుమారు 1.90 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు.

కొత్తగా 177 మందికి కొవిడ్‌
రాష్ట్రంలో కొత్తగా 177 కొవిడ్‌ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 2,95,101కి పెరిగింది. కరోనా కారణంగా మరో 2 మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకొని ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 1,606కు చేరింది. తాజాగా 198 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా మొత్తంగా 2,91,510 మంది చికిత్సానంతరం ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 3న(బుధవారం) రాత్రి 8 వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. బుధవారం 41,343 నమూనాలను పరీక్షించారు.

ఏపీలో 79 కేసులు
ఈనాడు, అమరావతి: ఏపీలో బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం 9గంటల వరకు 28,254 నమూనాలను పరీక్షించగా అందులో 79 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని