పట్టభద్రుడా.. ప్రాధాన్యమివ్వవా?
close

ప్రధానాంశాలు

పట్టభద్రుడా.. ప్రాధాన్యమివ్వవా?

ప్రచారం ముగిసింది..పలకరింపు మొదలైంది
రేపే ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఈనాడు, హైదరాబాద్‌: విమర్శలు... ఆరోపణలు... హామీలు...వాగ్దానాలతో హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనంత వాడీవేడిగా ప్రచారం సాగడం ఈ ఎన్నికల విశేషం. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి నాయకులు, అభ్యర్థులు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఓటర్లను వివిధ రూపాల్లో సంప్రదిస్తున్నారు. ఫోన్లలో మాట్లాడుతూ తమకే ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.  పలువురు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరాహోరీగా సాగించారు.వీరిలో కొందరు మూడు, నాలుగు నెలల నుంచి ప్రచారం చేయడం గమనార్హం. సిటింగ్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (తెరాస), రాంచందర్‌రావు (భాజపా)తో పాటు సురభి వాణీదేవి (తెరాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా), ఎల్‌.రమణ (తెలుగుదేశం), కోదండరాం (తెలంగాణ జన సమితి), జయసారథిరెడ్డి (వామపక్షాలు), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ), స్వతంత్రులుగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, తీన్మార్‌ మల్లన్న, రాణిరుద్రమ తదితరులు పోటీపడుతున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపాయి. 20 రోజులకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస, భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాల ముఖ్యనేతలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. తెరాస, భాజపాలకు చెరొక సిటింగ్‌ స్థానం ఉండగా ఈ సారి రెండు పార్టీలు రెండింటిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులతో  సభలు, సమావేశాలు నిర్వహించారు. కుల సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగాల భర్తీ, పీఆర్‌సీ, నిరుద్యోగ భృతి, ఎన్నికల హామీలు, విభజన హామీలు, పెట్రోధరలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా అనేక అంశాలు ఎన్నికల్లో ప్రచారంలో భాగమయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని