5 కి.మీ. పరిధిలోనే పది పరీక్షాకేంద్రాలు!

ప్రధానాంశాలు

5 కి.మీ. పరిధిలోనే పది పరీక్షాకేంద్రాలు!

ఈసారి విద్యార్థులకు మరింత చేరువగా
కరోనా నేపథ్యంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఈసారి విద్యార్థులకు మరింత చేరువ కానున్నాయి. చదివే పాఠశాలకు అయిదు కిలోమీటర్ల పరిధిలోనే అవి ఉండేలా ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు గరిష్ఠంగా 8కి.మీ. పరిధిలోని పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ప్రకటించిన కాలపట్టిక ప్రకారం పదో తరగతి ప్రధాన సబ్జెక్టులు మే 17న మొదలై 22కి పూర్తవుతాయి. ఆపై మూడు రోజులపాటు ఓరియంటల్‌ విద్యార్థులకు పరీక్షలున్నా హాజరయ్యేది వందల మందే. పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు పాఠశాలల్లో లేకుంటే ప్రభుత్వ లేదా ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలనూ పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. అప్పటికే ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి వాటిని తీసుకున్నా ఇబ్బంది లేదని భావిస్తున్నారు.
గదికి గరిష్ఠంగా 15 మందే
గత ఏడాది 5.34 లక్షల మంది దరఖాస్తు చేసినా కరోనా కారణంగా పరీక్షలు జరపలేదు. అంతర్గత పరీక్షల ఆధారంగా అందరినీ ఉత్తీర్ణులను చేశారు. ఈసారి సుమారు 5.20 లక్షల మంది హాజరుకానున్నారు. గత పరీక్షలకు మొదట 2,530 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా.. కరోనాతో గదికి 20-22కి బదులు 10-12 మంది  మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు. మరో 2,005 పరీక్షా కేంద్రాలు పెంచారు. ఈసారి విద్యాసంస్థలనే మూసేసినందున భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. గరిష్ఠంగా ఒక్కో గదికి 15 మందికి మించరని డీఈవో ఒకరు తెలిపారు. అంటే గత ఏడాది ప్రణాళిక తరహాలోనే పరీక్షా కేంద్రాలు 4,500కు చేరుకోనున్నాయి. ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు రోజులు.. ఏడు ప్రశ్నపత్రాలే ఉంటాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని