లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయండి

పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశం
టీకాపై సమాచారం ఉంటే పంపొచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. రేంజ్‌ ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా, ఉపాధి హామీ పనులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా తమ వెంట అక్రిడిటేషన్‌ కార్డులు ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు విధుల నిమిత్తం వెళ్లే ఉద్యోగులు శాఖాపరమైన గుర్తింపు కార్డులను ఉంచుకుంటే సరిపోతుందన్నారు. టీకాల కోసం వెళ్లేవారి మొబైల్‌ ఫోన్‌లో సంబంధిత సమాచారం (స్లాట్‌ బుకింగ్‌ వంటివి) ఉంటే సడలింపు ఇవ్వాలని సూచించారు. నిత్యావసర సరకుల రవాణా, అత్యవసర సేవల సిబ్బందికి ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అత్యవసర ప్రయాణాలు చేసే వారికి పాస్‌లు జారీ చేయాలని సూచించారు. దూర ప్రయాణాల నిమిత్తం ఇంటి నుంచి విమానాశ్రయాలకు, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారి వద్ద టికెట్లు ఉంటే చాలని, ఎలాంటి పాస్‌లు అవసరం లేదని స్పష్టం చేశారు.

అత్యవసర ప్రయాణాలకు ‘ఈ-పాస్‌’
అత్యవసర ప్రయాణాలు చేసే వారి కోసం తెలంగాణ పోలీసులు ‘ఈ-పాస్‌లు’ జారీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారే కాకుండా రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేవారు కూడా పాస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌ 
 https://policeportal.tspolice.gov.in లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం.. అంటే రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రయాణించే వారికి ఎలాంటి పాస్‌ల అవసరం ఉండబోదు. ఆ తర్వాత సమయాల్లో అత్యవసరంగా ప్రయాణించే వారికి ‘ఈ-పాస్‌’లు ఇస్తారు. సంబంధిత పోలీస్‌ కమిషనర్లు లేదా జిల్లా ఎస్పీలు వీటిని జారీచేస్తారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్‌ పరిధి నుంచి మరో కమిషనరేట్‌ పరిధిలోకి వెళ్లేవారికి ప్రయాణం ప్రారంభమయ్యే కమిషనరేట్‌ నుంచే పాస్‌లు జారీ అవుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు మాత్రం ఆ రాష్ట్రం నుంచే పాస్‌ తీసుకుని రావాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని