ఆలస్యమే ఆయువు తీసింది!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలస్యమే ఆయువు తీసింది!

‘రుయా’లో ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు

ఈనాడు, తిరుపతి: ప్రాణవాయువు సరఫరాలో జరిగిన ఆలస్యం 11 మంది ఆయువు తీసింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరా తగ్గడంతో బాధితులు మృత్యువాతపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్నాయని ముందుగానే గుర్తించినా.. తమిళనాడు నుంచి ట్యాంకర్‌ సకాలంలో రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపారు. కారణాలు ఏమైనా 11 మంది విగతజీవులుగా మారడం అందరినీ కలచివేసింది.

4 గంటలకు రావాల్సింది.. 8:30కు చేరింది
రుయా అధికారులు శ్రీపెరంబదూరులోని లిండే సంస్థతో మూడేళ్ల ఒప్పందం చేసుకున్నారు. రుయాలోని మూడు ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద సెన్సార్లు ఉన్నాయి. ట్యాంకులోని ఆక్సిజన్‌ స్థాయి 2/3 లేదా 50 శాతం తగ్గిన వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం ఆ సంస్థకు చేరుతుంది. వెంటనే ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపుకొని ఇక్కడికి తీసుకొస్తుంటారు. వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీపెరంబదూరులో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరి సాయంత్రం 4 గంటలకు రుయాకు చేరుకోవాలి. కానీ సాయంత్రం 4:15 గంటల సమయంలో ట్యాంకర్‌ బయల్దేరినట్లు చెబుతున్నారు. రుయాకు సుమారు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చేరుకుంది. అంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ట్యాంకర్‌ రుయాకు చేరుకుంది. సెన్సారు సక్రమంగా పనిచేయని కారణంగా ఆలస్యమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరాలో ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రెజర్‌ తగ్గడంతో..
ట్యాంకర్‌ రావడం ఆలస్యం కావడంతో రుయా అధికారులు సిలిండర్లలోని ఆక్సిజన్‌ను అందించే ప్రయత్నం చేశారు. సుమారు 20 సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. సిలిండర్ల ద్వారా సరఫరా చేసే వాయువు అంతవేగంగా వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రెజర్‌ తగ్గడంతో పైఅంతస్తులో ఉన్న బాధితులకు నెమ్మదిగా సరఫరా జరిగి ప్రాణనష్టం వాటిల్లినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రుయా దుర్ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం రాత్రి ఒక ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాగా మంగళవారం మరొకటి చేరుకుంది. దీన్ని ట్యాంకులోకి నింపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని