అమ్మకానికి భూములు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మకానికి భూములు

ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలు విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయం

విధివిధానాల ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం భూముల విక్రయానికి సిద్ధమైంది. నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాకు కనీసం వెయ్యి ఎకరాల చొప్పున  మార్కెట్‌ ధరల మేరకు బహిరంగ వేలం నిర్వహించి ఇవ్వనుంది. భూముల అమ్మకంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా విధివిధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల విక్రయాన్ని సమీక్షించి, ఎప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలు జారీచేయడం, సకాలంలో విక్రయాలు పూర్తిచేసేందుకు సీఎస్‌ ఆధ్వర్యంలో స్టీరింగ్‌ కమిటీని సర్కారు నియమించింది. ఈ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, గృహనిర్మాణ, పురపాలక, పరిశ్రమలు, న్యాయశాఖల ముఖ్యకార్యదర్శులుంటారు. విజయవంతంగా బహిరంగ వేలం ముగిసిన వెంటనే గడువులోగా రిజిస్ట్రేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. టీఎస్‌బీపాస్‌ విధానంలో అన్ని అనుమతులు జారీ చేయాలని తెలిపింది. బహిరంగ వేలంలో విజయవంతమైన బిడ్డర్‌కు పూర్తి నిధులు చెల్లించిన మూడువారాల్లోగా జిల్లా కలెక్టర్‌ ఆ భూమిని స్వాధీనం చేసి, కన్వీయన్స్‌ డీడ్‌ చేయాలని స్పష్టంచేసింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసుకునేందుకు బహిరంగ వేలానికి ముందుగా అవకాశమివ్వాలని నిర్ణయించింది.  బహిరంగవేలంలో వచ్చిన బిడ్లు పరిశీలించి, ఆమోదించేందుకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదా కలిగిన అధికారి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలని నిర్ణయించింది.  
మార్చి 19న నిర్ణయం
గత ఏడాది భూములు అమ్మాలని భావించినా, కరోనా కారణంగా సాధ్యం కాలేదు. ఈ ఏడాది ఎలాగైనా నిధులు సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం విధివిధానాలు సిద్ధం చేసింది. ఇప్పటికే గృహనిర్మాణ, పురపాలక, పంచాయతీరాజ్‌, పరిశ్రమలు తదితర ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో భూములను గుర్తించింది. ఈ మేరకు మార్చి 19న సీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ భూముల్ని బహిరంగ వేలం ద్వారా అమ్మాలన్న నిర్ణయం జరిగింది. ఈవిషయమై ప్రభుత్వ ఆధ్వర్యంలో సుదీర్ఘ చర్చలు జరిగిన తరువాత విక్రయానికి అనుమతి వచ్చింది.
భూముల కమిటీ నియామకం
వివాదాలు తొలగించి, భూములను బహిరంగ వేలానికి అందుబాటులో ఉంచేందుకు వీలుగా కమిటీలను నియమించింది. ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ ప్రతినిధి, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ఐజీ, సంబంధిత జిల్లా కలెక్టరు ఉంటారు. భూముల సరిహద్దులు గుర్తించి, జిల్లా స్థాయిలో కనీసం వెయ్యి ఎకరాల విక్రయభూముల ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం చేయాలి.
బహిరంగ వేలానికి ముందుగా భూముల అభివృద్ధి, స్పష్టమైన సరిహద్దులతో లేఅవుట్ల తయారీకి, టీఎస్‌బీపాస్‌ అనుమతుల కోసం అనుమతుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, టీఎస్‌ఎస్‌పీడీసీల్‌ సీఎండీ, జలమండలి ఎండీ, అగ్నిమాపక డీజీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ఉంటారు. ఈ కమిటీ అనుమతులు, భూముల వినియోగమార్పిడి, నీటిసదుపాయాలు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తుంది. ఎలాంటి రుసుం లేకుండా బహిరంగవేలానికి ముందు లేఅవుట్లకు అనుమతి ఇస్తుంది.
హెచ్‌ఎండీఏ కమిషనర్‌, గృహనిర్మాణబోర్డు ఎండీ, టీఎస్‌ఐఐసీ ఎండీ ఆధ్వర్యంలోని వేలం కమిటీ ఎంపిక చేసిన స్థలాల అభివృద్ధి, వేలం వేయడం, ప్రచారం నిర్వహించడం, రోడ్లు, వీధిదీపాల నిర్వహణ, క్షేత్రస్థాయి పర్యటనలు తదితర పనులను నిర్వహిస్తుంది.
ఇవీ నిబంధనలు...
బహిరంగ వేలం నిర్వహణకు ఆయా భూముల వివాదాలను కలెక్టర్లు తొలగించాలి. వాటి సరిహద్దులను స్పష్టంగా పేర్కొనాలి.
ఆయా భూముల్లో లేఅవుట్లకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సకాలంలో అనుమతులు జారీచేసి, వాటిని మాస్టర్‌ప్లాన్‌లలో ఆటోమేటిక్‌గా నమోదు చేయాలి.
టీఎస్‌బీపాస్‌ విధానంలో వెంటనే అనుమతులివ్వడంతో పాటు దరఖాస్తు చేసిన వారం రోజుల్లోనే అగ్నిమాపక, పర్యావరణ విభాగాలు పరిష్కరించాలి.
బహిరంగవేలం విధివిధానాలు, కనీస ధర, బిడ్‌పెంపు ఖరారు, మార్కెట్‌ ధరలను నోడల్‌ విభాగం పరిశీలించి నిర్ణయిస్తుంది.
నోడల్‌ ఏజెన్సీలు అవసరమైతే ప్రైవేటు కన్సల్టెంట్లను నియమించుకోవచ్చు. మార్కెట్‌ పరిస్థితులు, డిమాండ్‌ను పరిశీలిస్తూ విక్రయానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించి నోటిఫికేషన్లు జారీచేయవచ్చు.
బహిరంగ వేలం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఈ కామర్స్‌ సంస్థ ఎంఎస్‌టీసీ సేవలు వినియోగించుకోవాలి. అవసరమైతే ప్రైవేటు మార్కెట్‌ ఏజెన్సీ సహాయాన్ని పొందవచ్చు.
నోడల్‌ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో స్థలాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు సందర్శించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు ఆయా స్థలాల్లో అవసరం మేరకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలి.

భూముల విక్రయాల పరిశీలనకు భాజపా కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సర్కార్‌ భూముల్ని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంపై భాజపా స్పందించింది. విధివిధానాల పరిశీలనకు పార్టీ నుంచి ఒక కమిటీని వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్ణయించారు. ఇందులో రెవెన్యూ, ఆర్థికరంగ నిపుణులుంటారని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని