ఒక్కరు మరణించినా మీరే బాధ్యులు
close

ప్రధానాంశాలు

ఒక్కరు మరణించినా మీరే బాధ్యులు

పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

ఈనాడు, దిల్లీ: బోర్డు పరీక్షల నిర్వహణతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వాటి నిర్వహణపై వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ సహా రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపిస్తూ.. అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎప్పుడు నిర్వహించాలనే విషయమై జులై మొదటి వారంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.  ఇప్పటికే అన్ని రాష్ట్రాలూ పరీక్షల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాయని, ఆలస్యం చేస్తూ విద్యార్థుల్లో ఎందుకు అనిశ్చితి సృష్టిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై అభిప్రాయం తెలపాలని ధర్మాసనం నజ్కీని ఆదేశించగా రెండు రోజుల సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించని ధర్మాసనం బుధవారమే నిర్ణయం తీసుకుని అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. తాము పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని కేరళ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రకాశ్‌ తెలిపారు. ప్రభుత్వ అఫిడవిట్‌ను గురువారం పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.


తీసుకుంటున్న చర్యలను వివరించాం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పది, ఇంటరు పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. న్యాయస్థానం ఏ నిర్ణయం చెప్పినా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.


 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని