3,766 వైద్యుల పోస్టులు ఖాళీ
close

ప్రధానాంశాలు

3,766 వైద్యుల పోస్టులు ఖాళీ

మరో 1,985 నర్సుల ఉద్యోగాలు కూడా..

వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి

గరిష్ఠంగా ఏడాదికి మించి సమయం తీసుకోవద్దు

కొత్తగా 1,500 మంది డాక్టర్లు అవసరం

మంత్రివర్గ ఉపసంఘానికి ఆరోగ్యశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 3,766 వైద్యుల, 1,985 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యశాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. గరిష్ఠంగా ఏడాదికి మించి ఆ పోస్టులను ఖాళీగా ఉంచొద్దు’’ అని ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులపై భారం పడుతోందని, మరో 1,500 పోస్టులను అదనంగా భర్తీ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఒప్పంద వైద్యుల వేతనాలను పెంచాలని కూడా సూచించింది. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ బలోపేతంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పలు కీలక అంశాలపై నివేదికను అందజేసింది.

మొత్తంగా 33.91 శాతం ఖాళీలు

‘‘రాష్ట్రంలో మొత్తం 7,805 వైద్యుల పోస్టులు మంజూరవగా..4,039  మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 3,766(48.25 శాతం) ఖాళీగా ఉన్నాయి. అలాగే మొత్తం 9,152 స్టాఫ్‌ నర్సుల పోస్టులకు.. 7,167 భర్తీ అయ్యాయి. ఇంకా 1,985(21.68 శాతం) మందిని నియమించాలి. ఈ రెండు రకాలను కలిపి చూస్తే 5,751(33.91 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడం వల్ల మున్ముందు అనవసర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్పెషలిస్టు వైద్యులేమో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వైద్యులు, నర్సుల పోస్టులను ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే నియామక ప్రకటన వెలువరించి భర్తీ చేసుకోవాలి. ఇప్పటికే మంజూరైన పోస్టులను తిరిగి భర్తీ చేయడం కాబట్టి.. ఇందుకోసం మళ్లీ ఆర్థిక శాఖ వద్ద ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలనే నిబంధన పెట్టొద్దు. తద్వారా కాలయాపన తగ్గుతుంది. గరిష్ఠంగా ఏడాదికి మించి ఖాళీ ఉంచొద్దు. ఒప్పంద ఉద్యోగుల వేతనాలను తాజా పీఆర్‌సీని అనుసరించి పెంచే విషయాన్ని పరిశీలించాలి. తద్వారా రెగ్యులర్‌ నియామకాలు చేపట్టే వరకూ ఒప్పంద ప్రాతిపదికన చేరేందుకు ఎక్కువమందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది.

బోధనాసుపత్రుల్లో పెరిగిన రోగుల తాకిడి

ఇటీవల కాలంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. అందుకే కొన్ని ముఖ్య విభాగాల్లో వైద్యుల సంఖ్యను పెంచడానికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అబ్‌స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పిడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియా, రేడియాలజీ తదితర విభాగాల్లో 1,290 సహాయ ఆచార్యులను, క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌(సీఏఎస్‌)ల కేటగిరీలో కొత్తగా 210 వైద్యులను.. మొత్తంగా 1,500 కొత్త పోస్టుల్లో వైద్యులను నియమించాలి. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.287 కోట్ల ఆర్థిక భారం పడుతుంది.

పరిధి మార్చాలి...

ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4,745 ఆరోగ్య ఉప కేంద్రాలు కాకుండా.. ప్రస్తుతం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58.. 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు 9.. 100 పడకల ఆసుపత్రులు మరో 9 ఉన్నాయి. ఈ ఆసుపత్రులను ప్రజారోగ్య సంచాలకుల నుంచి వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి మార్చాలి.

ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతం

రాష్ట్రంలో గ్రామీణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌’లుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా మేం ముందుకెళ్తున్నాం. వీటిల్లో సేవలందించడానికి ఎంబీబీఎస్‌ వైద్యులు ముందుకు రాని పక్షంలో.. ఆ పోస్టులను అందుబాటులో ఉన్న ఆయుష్‌ వైద్యులు/స్టాఫ్‌నర్సులతో భర్తీ చేయాలి. ఇప్పటికే 573 ఆరోగ్య ఉపకేంద్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. మిగిలిన వాటికి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వీటితోపాటు మరో 1,677 ఆరోగ్య ఉపకేంద్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీంతో మొత్తం 4,745 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 2,250 అభివృద్ధి చెందుతాయి. మిగిలిన 2,495 ఆరోగ్య ఉపకేంద్రాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేస్తాం.

అన్ని పడకలకూ ప్రాణవాయువు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం పడకలకు ప్రాణవాయువు అందించాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 132 ఆసుపత్రుల్లో ఇప్పటి వరకూ 10,466 పడకలకు ఈ ఏర్పాటు జరిగింది. మరో 17,500 పడకలకూ అందుబాటులోకి రానుంది. నిలోఫర్‌ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న 1,000 పడకలను 2,000కు పెంచనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌’ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రంలో మరో 19 ప్రయోగశాలలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ సహా మరో 16 జిల్లాల్లో ఆర్‌టీ పీసీఆర్‌ నిర్ధారణ పరీక్షల ప్రయోగశాలలను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది’’ అని ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.


ఆసుపత్రుల అభివృద్ధికి ప్రాధాన్యం

తెలంగాణ ఏర్పాటు తర్వాత 58 ఆసుపత్రులను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మరో 11 ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. జిల్లా ఆసుపత్రిలో నిబంధనల మేరకు 300 పడకలు, కనీసం 9 స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉండాలి. అత్యధిక జిల్లా ఆసుపత్రుల్లో ఈ పరిస్థితులు లేవు. అందుకే జిల్లా ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం తొలిదశలో నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్‌, నర్సంపేట.. మొత్తంగా 9 ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని పేర్కొంటూ దస్త్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. వీటితో పాటు జనగామ, కామారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, భువనగిరి జిల్లా ఆసుపత్రుల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశాం.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని