స్వయం సమృద్ధంగా వాసాలమర్రి
close

ప్రధానాంశాలు

స్వయం సమృద్ధంగా వాసాలమర్రి

అంకాపూర్‌లాగా ఈ ఊరిని కూడా అందరూ సందర్శించేలా తీర్చిదిద్దుదాం

నిధుల బాధ్యత నాది.. పని బాధ్యత మీది

దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, నల్గొండ: వాసాలమర్రి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా వారానికి రెండు గంటల పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్బోధించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌లాగా ఈ పల్లె కూడా అభివృద్ధి చెంది భవిష్యత్తులో రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు సందర్శించేలా సర్పంచితో పాటు గ్రామస్థులు కృషి చేయాలన్నారు. అందరూ ప్రేమ భావంతో ఉండి, ఈర్ష్య, అసూయలను విడనాడాలన్నారు. ఊరిని సమష్టిగా బాగు చేయాలనే తపన ఉండాలన్నారు. ఊరిలో పోలీసు కేసులు ఉంటే త్వరితగతిన స్థానికంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. తాను దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ మంగళవారం సందర్శించారు. ఎర్రవల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తూ గ్రామంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  దాదాపు 3 వేల మంది గ్రామస్థులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొని గ్రామాభివృద్ధిపై ప్రసంగించారు. యాదాద్రి జిల్లాలోని 421 పంచాయతీలకు రూ.25 లక్షలు, భువనగిరి పురపాలికకు రూ.కోటి చొప్పున, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్‌ పురపాలికలకు రూ.50 లక్షల నిధులను సీఎం సహాయ నిధి నుంచి ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఇలా సాగింది.

ప్రభుత్వమే మీకు అండ

‘‘ముఖ్యమంత్రే వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాక మీకు కాని పని ఏముంటుంది? బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్‌ను నిర్మించుకుందాం. రహదారులను బాగు చేసుకుందాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది. అవసరమైతే మరో 20 సార్లు ఇక్కడికి వస్తా. ఇప్పటి నుంచి అన్ని పల్లెల్లా కాకుండా మీరంతా పట్టుబట్టి గ్రామం అభివృద్ధికి కట్టుబడాలి. పనిచేసే బాధ్యత మీది. అవసరమైన వారందరికీ ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలు ఇస్తాం. ఇంటికో పాడిగేదె ఇస్తే దాంతో మీ కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు. ఊర్లోని ప్రజలంతా కొంత, ప్రభుత్వం కొంత వేసి గ్రామ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధి ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చుకోవచ్చు.

గ్రామాభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేసుకోండి

ఎవరికి వారు నాకేం పని అనుకోకుండా అందరూ ఊరి బాగు కోసం పనిచేయాలి. గతేడాది వరంగల్‌ నుంచి వస్తూ ఈ ఊరిని చూసి అక్కడే ఉన్న నలుగురైదుగురితో మాట్లాడాను. అప్పుడే అనుకున్న ఈ గ్రామాన్ని బాగుచేద్దామని. ఈ పని నాకు దేవుడే చెప్పిండేమో మరి. అనంతరం సర్పంచితో పాటు ఈ ఊర్లోని 40 మంది వచ్చి నన్ను కలిశారు. కలెక్టరుకు చెప్పి మీరంతా అంకాపూర్‌ వెళ్లి అక్కడి అభివృద్ధిని చూసిరమ్మని చెప్పాను. దాదాపు 200 మంది వెళ్లి అక్కడి పరిస్థితులను చూసొచ్చారు. తర్వాత యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం పెట్టి ఊరి ప్రజలందరి ఆరోగ్యాన్ని పరీక్షించారు. తొలుత మీ గ్రామానికి సంబంధించి గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)ని తక్షణం ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనం, పరిశుభ్రత, శ్రమదానం, వ్యవసాయం ఇలా అన్ని అంశాలకు ఒక్కో కమిటీ వేసి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రచించాలి. ముఖ్యంగా మహిళలు శాంతంగా ఉండి ఊరిలో గొడవలు లేకుండా చూసుకోవాలి. ఊరి బాగులో పాత్ర తీసుకోవాలి.

అంకాపూర్‌లా.. వాసాలమర్రిని సందర్శించాలి

1987లోనే అంకాపూర్‌లోని రెండు బ్యాంకుల్లో రైతుల సొమ్ము రూ.9 కోట్లు, రూ. 13 కోట్లు ఉండేవి. అక్కడ కూడా మీలాగే రైతులే. కానీ ఏ పంట వేయాలి, ఎక్కడ అమ్ముకోవాలనేది కమిటీల ద్వారా నిర్ణయిస్తారు. పంటలను అమ్మడానికి అక్కడ మార్కెటింగ్‌ కమిటీ ఉంటుంది. వారంతా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఏ పంటకు డిమాండ్‌ ఉందో అదే వేస్తారు. పంట రాగానే వాటిని తరలించడానికి 30, 40 డీసీఎంలు తయారుగా ఉంటాయి. అక్కడ వీడీసీలే సుప్రీంకోర్టు. రెండు మూడుసార్లు సర్పంచికే జరిమానా వేశారు. మీ గ్రామం కూడా భవిష్యత్తులో అంకాపూర్‌లా త యారై అందరూ సందర్శించేలా అభివృద్ధి చెందాలి.

ప్రతి పైసా సద్వినియోగం కావాలి

ప్రభుత్వం విడుదల చేసే ప్రతిపైసా సద్వినియోగం చేసుకోవాలి. సమాజాన్ని అధ్యయనం చేసేలా చదువుకున్న వారు చదువుకోని వారికి చెప్పాలి. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్‌ యూనుస్‌ ఇలానే అక్కడి మహిళలు పడుతున్న కష్టాన్ని చూడలేక ఆరుగురితో కూడిన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారికి వారు స్వయం ఉపాధి పొందేలా తయారు చేశారు. ఇక్కడ కూడా మహిళలంతా బృందాలుగా ఏర్పడి ప్రతి రూపాయిని పొదుపు చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

వంటలెలా ఉన్నాయ్‌

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌ భోజనశాలలో పలువురిని పలకరించారు. వంటలెలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు దాదాపు మూడు వేల మంది భోజనాలకు ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్‌ సునీత, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, కలెక్టరు పమేలా సత్పతి, ఇతర అధికారులతో పాటు అదే గ్రామానికే చెందిన ఆకుల ఆగమ్మ, చెన్నూర్‌ లక్ష్మి అనే ఇద్దరు మహిళలతో కలిసి భోజనం చేశారు.

23 రకాల వంటకాలు

వాసాలమర్రి గ్రామస్థులకు 23 రకాల వంటకాలను వడ్డించారు. మటన్‌, చికెన్‌, బోటీ కూర, చేపలు, మటన్‌ తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌ పన్నీర్‌, బిర్యానీ, పులిహోర, సాంబార్‌, పండ్ల రసాలు, ఆలు కుర్మా, పాలకూర పప్పు.. ఇలా వివిధ రకాల పదార్థాలను గ్రామస్థులు రుచిచూశారు. వంట వాళ్లను ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి విమానంలో పిలిపించినట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి, రాజ్యసభ ఎంపీలు సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదారి కిశోర్‌, డీసీసీబీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, యాదాద్రి జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచి పోగుల అంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


రెక్కల కష్టం చేసేవారికి అండగా

మీ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం తరఫున యాదాద్రి జిల్లా కలెక్టరు పమేలా సత్పతిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నా. ఇప్పటి నుంచి మీకు తల్లీ తండ్రి కలెక్టరే. వాసాలమర్రి అంతా నా కుటుంబమే. తొలుత మీ గ్రామంలో రెక్కల కష్టంతో పనిచేసే వారి వివరాలు నమోదు చేయండి. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలున్నాయి, ఎంత మంది సభ్యులున్నారు, వారిలో చదువుకున్నవాళ్లు ఎంత మంది, భూమి ఎంతమందికుంది, ఆరోగ్య పరిస్థితి, బీమా సౌకర్యం.. ఇలా అన్ని వివరాలు నమోదు చేయాలని కలెక్టరును కోరుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాలో రామునిపట్ల అనే గ్రామంలో వారికి వారే గ్రామాభివృద్ధికి పూనుకున్నారు. తొలుత ఏ పని లేక ఖాళీగా ఉన్న నలుగురికి హైదరాబాద్‌లో కుట్టుమిషన్‌ నేర్పించారు. ఊర్లోని వారందరూ ఆ నలుగురి వద్దే దుస్తులు కుట్టించాలి. కొంత మందికి డీసీఎంలు, ట్రాక్టర్లు కొనిచ్చారు. ఊరి ప్రజలంతా వీరి దగ్గరే డీసీఎం, ట్రాక్టర్‌ పనులు చేయించుకోవాలి. కొంత మందికి కూరగాయల దుకాణం పెట్టించారు. ఇలా ఆ గ్రామంలోని ప్రజలే వారికి వారు స్వయంగా ఉపాధి కల్పించుకున్నారు. వాసాలమర్రి సైతం ఇలా ఉపాధి కల్పించేలా తయారు కావాలి. నేను మళ్లీ 20 సార్లు వస్తా. ఊర్లో కూర్చొని అందరితో మాట్లాడుతా. దళితవాడలను సందర్శించి వాటిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై మీ అందరితో చర్చిస్తాను.


28న కలెక్టర్లతో సీఎం సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులను ఆహ్వానించారు. మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని