60 గజాల్లోనూ ప్లాట్లు

ప్రధానాంశాలు

60 గజాల్లోనూ ప్లాట్లు

143 గజాల నుంచి విస్తీర్ణం తగ్గింపు

అప్రోచ్‌ రోడ్డు 60 అడుగుల వెడల్పు

15 శాతం ప్లాటు విస్తీర్ణం తనఖాకు

టీఎస్‌-బీపాస్‌ ద్వారా అనుమతి

రాష్ట్రంలో లేఅవుట్లకు కొత్త నిబంధనలు

నగరపాలికలు, పురపాలక సంఘాలకు వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని లేఅవుట్‌ నిబంధనలను ప్రభుత్వం పటిష్ఠం చేసింది. స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతికి పురపాలకశాఖ శ్రీకారం చుట్టింది. ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని గతంలోకంటే దాదాపు సగానికిసగం తగ్గించింది. కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు గజాలు (50 చదరపు మీటర్లు), కనీస వెడల్పు 20 అడుగులుగా నిర్ధారించింది. రాష్ట్రంలో కొత్త పురపాలక చట్టం, టీఎస్‌-బీపాస్‌ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు చేసింది. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇచ్చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించినవారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ప్రతి లేఅవుట్‌లో సామాజిక వసతుల కల్పనకు కేటాయించే స్థలాన్ని ప్రభుత్వం మరో 2.5 శాతం పెంచింది. అలాగే అప్రోచ్‌ రోడ్డు 60 అడుగులు ఉండాల్సిందేనని పేర్కొంది. 50 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో వేసే లేఅవుట్లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. మొత్తం ప్లాట్ల విస్తీర్ణంలో 15 శాతం స్థలాన్ని పురపాలకశాఖకు తనఖాపెట్టాలి. కొత్త లేఅవుట్‌ నిబంధనలు ఈనెల 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మినహా రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు వర్తిస్తాయి. కలెక్టర్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ వీటికి అనుమతి మంజూరు చేస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం లేఅవుట్‌లలో వేసే ప్లాటు విస్తీర్ణం గతంకంటే తగ్గింది. విస్తీర్ణం 60 చదరపు గజాలు (50 చదరపు మీటర్లు) ఉంటే సరిపోతుంది. గతంలో కనీస ఇది 143 చదరపు గజాలు (120 చదరపు మీటర్లు)గా ఉండేది. అలాగే రోడ్డు వైపు ప్లాటు కనీస వెడల్పు 20 అడుగులు (6 మీటర్లు) ఉంటే సరిపోతుంది. గతంలో అది 10 మీటర్లుగా ఉండేది.

రెండేళ్లలోపు సదుపాయాలు

ప్రాథమిక లేఅవుట్‌ అనుమతులు వచ్చిన రెండేళ్లలోపు డెవలపర్‌ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేక సందర్భాల్లో పురపాలక కమిషనర్‌ మరో ఏడాది గడువు పొడిగించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ప్రాథమిక లేఅవుట్‌ అనుమతి ఫీజులో 20 శాతం మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. గడువులోగా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే తనఖా పెట్టిన 15 శాతం ప్లాటు విస్తీర్ణ స్థలాన్ని అమ్మేసి కమిషనరే మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

పది శాతం స్థలంలో ఇలా

ప్రతి లేఅవుట్‌లో 10 శాతానికి తక్కువకాకుండా ఖాళీ స్థలాన్ని ముందుగా ప్రజావసరాల కోసం పురపాలకశాఖకు అప్పగించాలి. ఇందులోని 9 శాతం స్థలాన్ని పచ్చదనం పెంపునకు వినియోగిస్తారు. ఒక శాతం స్థలాన్ని మంచినీళ్ల ట్యాంకు, ఎస్టీపీ, ట్రాన్స్‌ఫార్మర్‌, కామన్‌ పార్కింగ్‌ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు అదనంగా సామాజిక వసతుల కల్పనకు 2.5 శాతం స్థలాన్ని కేటాయించాలి. ఈ స్థలాన్ని ప్రధానంగా ఫార్మసీ, క్లినిక్‌, పాఠశాల, ప్లే స్కూల్‌, క్రష్‌, డిస్పెన్సరీ వంటివాటికే వినియోగించుకోవాలి. ఆ అవసరాలకు వినియోగించేలా ఈ స్థలాన్ని లేఅవుట్‌ అభివృద్ధిదారు విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుంది. 50 ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో లేఅవుట్లు ఉంటే స్కూలు, ఆరోగ్యకేంద్రం, వాణిజ్య సదుపాయలకు నిర్దేశించిన మేర స్థలం కేటాయించాలి.

అప్రోచ్‌ రోడ్డు 60 అడుగులు

లేఅవుట్‌ నుంచి ప్రధాన రోడ్డుకు అప్రోచ్‌ రోడ్డు కచ్చితంగా 60 అడుగులు (18 మీటర్లు) ఉండాల్సిందే. ఇది గతంలో 30 అడుగులుగా ఉండేది. అప్రోచ్‌ రోడ్డు తక్కువ ఉంటే దానిని వెడల్పు చేసేందుకు అదనంగా భూమి వదిలిపెట్టాలి. 30 అడుగులే ఉంటే మిగిలిన రోడ్డు అభివృద్ధికి అవసరమయ్యే వందశాతం అభివృద్ధి ఛార్జీలను ఇంపాక్ట్‌ ఫీజుగా చెల్లించాలి. ఒకవేళ లేఅవుట్‌లో అప్రూవ్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు 18 మీటర్లు ఉండి వాస్తవ రోడ్డు అంతకంటే తక్కువ ఉంటే రోడ్డు ఇంపాక్ట్‌ ఫీజు 50 శాతం చెల్లించాలి.

అనుమతి ఇలా

లేఅవుట్‌కు టీఎస్‌-బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. దరఖాస్తు సమయంలో నిర్దేశించిన పత్రాలతో రూ.10 వేల రుసుం చెల్లించాలి. ఒకవేళ దరఖాస్తులో పత్రాలు అసంపూర్తిగా ఉంటే పది రోజుల్లోగా తెలియచేస్తారు. దరఖాస్తుదారు మళ్లీ ఏడురోజుల్లోగా వాటిని అందజేయాలి. సమాచారం అంతా పక్కాగా ఉంటే కమిటీ వెంటనే అనుమతి ఇస్తుంది. లేఅవుట్‌ ఫీజును నోటీసు ఇచ్చిన 30 రోజుల్లోగా చెల్లించాలి. ఆ లోపు చెల్లించకుంటే మరో 30 రోజులు సమయం ఇస్తారు. 10 శాతం వడ్డీతో చెల్లించాలి. అనుమతి వచ్చిన 30 రోజుల్లో మార్టిగేజ్‌ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాత లేఅవుట్‌ యజమాని సమర్పించిన గిఫ్ట్‌డీడ్‌, మార్టిగేజ్‌ డీడ్‌, లేఅవుట్‌ ప్లాన్‌లను పురపాలక కమిషనర్‌ సరిచూసుకుని మౌలిక సదుపాయాలు, మిగతా అభివృద్ధి పనులు చేసుకునేందుకు మూడు రోజుల్లోపు తెలియజేస్తారు.

కలెక్టర్‌ కమిటీ ద్వారా అనుమతి

జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) కన్వీనర్‌గా వ్యవహరించే కమిటీ ఈ లేఅవుట్‌లకు అనుమతి ఇస్తుంది. ఇందులో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్‌ నామినేట్‌ చేసిన అధికారి సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు వచ్చిన 5 రోజుల్లోగా కమిటీ పరిశీలించాలి. 10 ఎకరాల్లోపు విస్తీర్ణం అయితే పురపాలక, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, పదెకరాలు మించితే డీటీసీపీ, దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక తనిఖీలు చేసి జిల్లా కలెక్టర్‌కు ఐదు రోజుల్లోగా అందించాలి.


నిర్లక్ష్యం చేస్తే బ్లాక్‌లిస్ట్‌లోకే

మూడేళ్లలో లేఅవుట్‌ అభివృద్ధిదారు లేదా సంస్థలు మౌలిక సదుపాయాలను కల్పించకుంటే వారు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేఅవుట్‌లను వేయకుండా, వాటిలో భాగస్వాములు కాకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని