మావి ఎన్నికల పథకాలు కావు
close

ప్రధానాంశాలు

మావి ఎన్నికల పథకాలు కావు

ఆషామాషీగా తేలేదు

రేపటి తెలంగాణ యువతదే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయబోనని హామీ

హరితహారం చెట్ల కింద కేసీఆర్‌ ఒక్కడే కూర్చోడు. పాలన రాదు అన్న ఆంధ్రప్రదేశ్‌ ఇవ్వాళ ఏ పరిస్థితుల్లో ఉంది? తెలంగాణలో పండిన పంటలతో ఏపీకి పోలిక లేదు. తెలంగాణ రైతులు 3 కోట్ల టన్నుల వడ్లు పండించారు. 90 లక్షల టన్నులు ఎఫ్‌సీఐకి ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లెందరో స్థిరపడ్డారు. వారిని హైదరాబాదీలనే పిలవాలి. వారు అలానే భావిస్తూ మమేకమయ్యారు.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎన్నికల కోసం తేలేదని, ప్రజల కోణంలో ఎన్నో రకాలుగా ఆలోచించాకే ఆరంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎవరూ తమను పథకాలు ప్రవేశపెట్టాలని కోరలేదని, ధర్నాలు చేయలేదని, ఎన్నికల సమయంలో ఏ పథకం చేపట్టలేదని తెలిపారు. తమ పథకాలన్నీ విజయవంతమయ్యాయని, ఆయా వర్గాలను అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. తమ పనితీరుకు తగ్గట్టుగానే ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తున్నారన్నారు. టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయనకు సీఎం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో తెరాసలోకి వస్తున్న కౌశిక్‌రెడ్డి, ఆయన మిత్రులందరికీ స్వాగతం. మలిదశ ఉద్యమంలో కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పనిచేశారు. కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరాలని చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను ఎవరూ ఆపలేరు. కౌశిక్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. నేనే మార్గనిర్దేశం చేస్తా. ఆయనకు చిన్న పదవిని ఇచ్చి సరిపెట్టను. కేవలం హుజూరాబాద్‌కు, కరీంనగర్‌ జిల్లాకు మాత్రమే పరిమితం చేయబోను. నా తర్వాతి స్థానం యువతదే. పార్టీ పటిష్ఠం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలి. నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత యువతదే. గుడ్డి విమర్శలకు భయపడబోము. మా ప్రస్థానాన్ని ఆపేది లేదు. రాజకీయాలు నిరంతర ప్రక్రియ. గెలుపు ఓటములు సహజం. శాశ్వతంగా అధికారం ఎవ్వరికీ ఉండదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. నేను ఎన్నాళ్ల నుంచో రాజకీయాల్లో ఉన్నా ఎన్టీఆర్‌ అవకాశం ఇస్తేనే ఎమ్మెల్యే అయ్యా.

ఒక్కో సమస్యనూ అధిగమిస్తున్నాం

ఈ రాష్ట్రం అప్పనంగా రాలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం చేసి సాధించుకున్నాం. నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టుండరు. నా ముక్కును, వ్యక్తిగత విషయాలనూ విడవలేదు. నన్ను విమర్శించిన వారి ముందే తెలంగాణ వచ్చింది. రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు. అవగాహనతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ వస్తున్నాం. ఒక్కో పథకం రూపకల్పన వెనుక ఎంతో కృషి ఉంది. తెలంగాణ ప్రజలు గర్వంగా బతకాలనేదే మా ఉద్దేశం. గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. స్వయంగా కేంద్రమంత్రే ఈ విషయం ప్రకటించారు. గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం పథకం కాదు. రాష్ట్రం దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి ఎదిగింది. గతంలో కరెంట్‌ లేక రైతులు బాయిలకాడ ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరంతర విద్యుత్‌తో వారి గోస తీర్చాం. రైతుబంధుతో అప్పు, సప్పు లేకుండా ·తెలంగాణ రైతులు ధీమాగా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. గంగిరెద్దులొస్తే గతంలో దోసిళ్లతో వడ్లు దానం చేసేవాళ్లు. ఇప్పుడు చాటేడు దానం చేస్తున్నారు’’ అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కౌశిక్‌రెడ్డి తన మద్దతుదారులతో కలిసి గచ్చిబౌలి నుంచి భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు.


వారి ధ్యాసంతా ఓట్ల మీదే

దళితబంధు పథకం ఒక్క హుజూరాబాద్‌కే కాదు. రాష్ట్రం మొత్తానికి వస్తుంది. దీనిని చూసి కొందరికీ రక్తపోటు పెరుగుతోంది. వారి ధ్యాసంతా ఓట్ల మీదే తప్ప ప్రజల కోసం కాదు. అది ఎన్నికల పథకం కాదు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువు ఉంది. కేసీఆర్‌ కిట్‌, ధరణి, గురుకులాలు తీసుకురమ్మని ఎవరూ నన్నడగలేదు. అయినా ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టాం. నాకు రాజకీయ స్వార్థం ఉంటే దళిత బంధును సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ప్రవేశపెట్టేవాడిని. గెలవని వారే హామీలు ఇస్తుంటే గెలిచే పార్టీగా మేం ఎందుకు ఇవ్వం? అధికారంలో ఉన్నవాళ్లు తప్పులు చేస్తే దుష్పరిణామాలు తలెత్తుతాయి.


దళితబంధు పథకం లబ్ధిదారులకు మళ్లీ జన్మలో పేదరికం రాదు. రూ. పది లక్షలపై లబ్ధిదారుకే పూర్తి హక్కు ఉంటుంది. ఇందులో కుటుంబ రక్షణ నిధి ద్వారా ఆపత్కాలంలో ఆదుకుంటాం. రూ. పది లక్షలు ఊరికే పంచిపెట్టుడు కాదు. లబ్ధిదారులందరికీ ఒక చిప్‌, బార్‌కోడ్‌ ఉంటాయి. పది లక్షల నగదును ఎప్పుడేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. సామాజిక వివక్ష దారుణం. ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరికీ తెలియదు. దరఖాస్తు చేసుకుని పుట్టే పరిస్థితి ఉండదు. ఊరు, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం.

- సీఎం కేసీఆర్‌Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని