రాష్ట్రంలో వైద్యసీట్లు 5,240

ప్రధానాంశాలు

రాష్ట్రంలో వైద్యసీట్లు 5,240

అఖిల భారత కోటా సీట్లు 6,515
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మొత్తంగా 5,240 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇందులో 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1790, 23 ప్రైవేట్‌ కళాశాలల్లో 3450 ఎంబీబీఎస్‌ సీట్లున్నట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం అంటే 268 ఎంబీబీఎస్‌ సీట్లు అఖిల భారత కోటాలోకి వెళ్తాయి. అన్ని రాష్ట్రాల సీట్లు కలుపుకొని 2021-22 సంవత్సరానికి అఖిల భారత కోటాలో 6515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 83275 ఎంబీబీఎస్‌ సీట్లుండగా.. ఇందులో ప్రభుత్వంలో 289 కళాశాలల్లో 43435 సీట్లు, 269 ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో 39840 సీట్లున్నాయి. వీటన్నింటినీ నీట్‌ అర్హత మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారు. జాతీయస్థాయిలో అఖిల భారత కోటాలో రెండుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించాక మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కు ఇస్తారు.

తెలంగాణలో 2,237 పీజీ సీట్లు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో కలుపుకొని 42720 పీజీ వైద్య సీట్లున్నాయి. ఎంబీబీఎస్‌ సీట్లలో దాదాపు సగం పీజీ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో మొత్తంగా 2237 పీజీ సీట్లు ఉండగా వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 1053 సీట్లు, ప్రైవేట్‌లో 1,184 సీట్లు ఉన్నాయి. త్వరలో జరగనున్న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని