రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదికివ్వండి

ప్రధానాంశాలు

రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదికివ్వండి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఎన్జీటీ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌-ఎన్జీటీ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనలో భాగంగా పనులు నిర్వహిస్తుందో లేదంటే ప్రధాన ప్రాజెక్టు పనులను చేపడుతుందో పరిశీలించాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సహకరించలేదని చెప్పడంకాదని, బోర్డు తనంతట తానుగా వెళ్లి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నారాయణపేట జిల్లాకు చెందిన జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై ఎన్జీటీ జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, ప్రత్యేక నిపుణుడు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. కృష్ణా బోర్డు, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లను పరిశీలిస్తే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ట్రైబ్యునల్‌ వ్యక్తిగతంగా సందర్శించాలని, ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రత్యక్షంగా పనులను పరిశీలించే పరిధి ఈ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు లేదని, కృష్ణా బోర్డే పరిశీలిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి, దొంతిరెడ్డి మాధురిలు వాదనలు వినిపిస్తూ త్వరలో కృష్ణా ట్రైబ్యునల్‌లో కేసు విచారణ ఉందని, అది పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణార్హం కాదని, ఇదే విషయాన్ని కౌంటరులో పేర్కొన్నామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కౌంటరు ఇంకా తమకు అందలేదంది. ‘‘తప్పో ఒప్పో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో ఛాంపియన్‌లుగా నిలవాలని చూస్తున్నాయి. ఇది చట్టపరంగా కావచ్చు, లేదా రాజకీయంగా కావచ్చు. ప్రస్తుతం చేపడుతున్నవిగానీ, చేపట్టినవిగానీ పర్యావరణంతో సహా అన్ని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని మేం పరిశీలిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి నివేదిక సమర్పించండి’’ అని కృష్ణాబోర్డును ఆదేశించింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని