కుండపోతతో కుమ్మేసింది..

ప్రధానాంశాలు

కుండపోతతో కుమ్మేసింది..

వాంకిడిలో 24 గంటల్లో 39 సెం.మీ.
గత 120 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం రికార్డు
రాష్ట్రస్థాయిలో 86 శాతం అధికం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వానలతో వర్షపాతం గత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయి. గడచిన 120 ఏళ్లలో ఎన్నడూ ఏ సీజన్‌లో లేనంతగా తెలంగాణ చరిత్రలో అధిక వర్షపాతం రికార్డులు గత రెండురోజుల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం జిల్లా వాంకిడిలో గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 వరకూ 24 గంటల వ్యవధిలో 39 సెంటీమీటర్ల (సెం.మీ.) వర్షం కురిసింది. ఇది కొత్త రికార్డు. తాజాగా 30 సెం.మీ.ల వానతో రెండో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా కుమురంభీం జిల్లాలోనే ఆసిఫాబాద్‌లో నమోదైంది.
* గత 120 ఏళ్ల వాతావరణశాఖ రికార్డుల ప్రకారం ఇలా ఒకరోజు (24 గంటల్లో) అత్యధిక వర్షం నిజామాబాద్‌లో 1983 అక్టోబరు 6న 35.5 సెం.మీ.లు కురిసినట్లుగా ఉంది. 1908 సెప్టెంబరు 28న హన్మకొండలో 30.4 సెం.మీ.ల వాన పడింది.
* జూన్‌, జులై నెలల్లో రాష్ట్రంలో సాధారణం కన్నా 86 శాతం అధికంగా పడటం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి.

నేడు భారీగా.. రేపు ఒక మాదిరి

బంగాళాఖాతంలో ఈ నెల 22న ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింత తీవ్రమై ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాలు వేగంగా కదులుతున్నందున శనివారం భారీగా, ఆదివారం ఒక మాదిరి వర్షాలు తెలంగాణలో కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న చెప్పారు.

వరద బాధితులను ఆదుకోండి: గవర్నర్‌

వరద బాధితులకు అవసరమైన సాయం అందించాలని గవర్నర్‌ తమిళిసై తెలంగాణలోని రెడ్‌క్రాస్‌ ప్రతినిధులను, వాలంటీర్లను కోరారు. శుక్రవారం ఆమె పుదుచ్చేరి నుంచి దృశ్యమాధ్యమంలో ఇక్కడి రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో మాట్లాడారు. వర్షాల పరిస్థితిని తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఆహారం, దుప్పట్లు, పాత్రలు, అవసరమైన సరంజామా అందజేయాలన్నారు. వ్యాధులు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని