‘ఈటల చిన్నోడు.. వదిలేయ్‌’.. తెరాస నేతకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

ప్రధానాంశాలు

‘ఈటల చిన్నోడు.. వదిలేయ్‌’.. తెరాస నేతకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

రామస్వామి గారూ.. హైదరాబాద్‌ రండి

దళితబంధు పథకం అమలుపై మాట్లాడుకుందాం

ఈనాడు డిజిటల్‌- కరీంనగర్‌, న్యూస్‌టుడే- జమ్మికుంట గ్రామీణం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన తెరాస నాయకుడు వాసాల రామస్వామికి ఫోన్‌ చేశారు. దళితబంధు పథకంపై ఆయనతో మాట్లాడారు. ఈ నెల 26న పథకంపై హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమావేశానికి ఆహ్వానించారు. రామస్వామి మాట్లాడుతూ.. ‘‘2001 నుంచి నేను తెరాసలో పనిచేస్తున్నాను. ఈటల రాజేందర్‌ నాకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వలేదు. 2018లో నా భార్య (వాసాల నిరోష)కు తనుగుల ఎంపీటీసీ టికెట్‌ ఇవ్వలేదు. అయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాం. అప్పటినుంచి ఈటల దగ్గరికి వెళ్లలేదు’’ అని రామస్వామి అన్నారు. సీఎం కల్పించుకుని ‘రాజేందర్‌ చిన్నోడు.. అది అయ్యేదిగాదు సచ్చేదిగాదు వదిలేెయ్‌’ అంటూ దళితబంధు పథకంపై సంభాషణను కొనసాగించారు. ‘‘దళితబంధు పథకంపై ఈ నెల 26న ఊరికి ఇద్దరు చొప్పున అన్ని మండలాల నుంచి మొత్తం 427 మందితో పాటు మరో 30-40 మంది అధికారులు హైదరాబాద్‌ రండి. మీరు వచ్చాక సమావేశం నిర్వహిద్దాం. 2 గంటల సమావేశం తర్వాత భోజనం చేద్దాం. తర్వాత మళ్లీ రెండు గంటలు చర్చిద్దాం. ప్రాణం పోయినా పథకం అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అన్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. ‘‘మీరు ఫిక్స్‌ అయితే వంద శాతం సక్సెస్‌ అవుతాం సార్‌’’ అనడంతో ‘అంతే కదా’ అంటూ సీఎం బదులిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని