3 లక్షల మందికి కొత్తరేషన్‌ కార్డులు

ప్రధానాంశాలు

3 లక్షల మందికి కొత్తరేషన్‌ కార్డులు

పూర్తయిన దరఖాస్తుల పరిశీలన
రేపటి నుంచి ధ్రువపత్రాల జారీ
త్వరలో ప్రత్యేక నమూనాతో కార్డులు: మంత్రి గంగుల
90 లక్షలు దాటనున్న రేషన్‌కార్డులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రేషన్‌కార్డు అర్జీదారుల నిరీక్షణకు తెరపడనుంది. కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి 3,04,253 కుటుంబాలు కొత్తగా రేషన్‌కార్డుకు అర్హమైనవిగా యంత్రాంగం గుర్తించింది. ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు అర్హులకు ఈ నెల 26 నుంచి నెలాఖరు వరకు కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం అందిస్తామని, త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందిస్తామని వెల్లడించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఆయన నూతన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. వీరందరికీ ఆగస్టు నుంచి రేషన్‌ బియ్యం అందించనున్నారు.

4,15,901 దరఖాస్తులు

రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 కుటుంబాలు కొత్తకార్డులకు ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకున్నాయి. సాంకేతిక విభాగం వడపోత తరువాత 3,91,112 దరఖాస్తులను పరిశీలనకు తీసుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులు అర్జీదారుల ఇంటింటికీ వెళ్లి స్థితిగతుల్ని పరిశీలించి అర్హులైన వారికి ఆమోదముద్ర వేశారు. అన్ని జిల్లాల్లో వారం కిందటే దరఖాస్తుల పరిశీలన పూర్తవగా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ నెల 23 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. మొత్తంగా 3,04,253 కుటుంబాలను అర్హమైనవిగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 87,41,019 కుటుంబాలకు ఆహారభద్రత కార్డులున్నాయి. కొత్తగా ఇవ్వనున్న వాటితో కలిపి మొత్తం కార్డుల సంఖ్య 90,45,272కి చేరనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని