రంగన్నను బెదిరించలేదు

ప్రధానాంశాలు

రంగన్నను బెదిరించలేదు

వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-పులివెందుల: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కాపలాదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం, విలేకర్లతో మాట్లాడుతూ ఎర్ర గంగిరెడ్డి తనను చంపుతానని బెదిరించినట్లు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై ఎర్ర గంగిరెడ్డి శనివారం స్పందిస్తూ రంగన్నను ఒక్కసారి మినహా తాను ఎప్పుడూ చూడలేదని చెప్పగా.. ఆయన తనను బెదిరించారని రంగన్న మరోమారు అన్నారు. రంగన్న వెల్లడించిన పేర్ల జాబితాలోని సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఇంటికి శనివారం తాళం వేసి కనిపించింది. 


నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు: గంగిరెడ్డి

రంగన్నను చంపుతానని తాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆయన తాగేసి నోటికొచ్చినట్లు మాట్లాటడం భావ్యం కాదని ఎర్ర గంగిరెడ్డి అన్నారు. శనివారం పులివెందులలో మాట్లాడారు. ‘వివేకాను చంపినోళ్లు, చంపించినోళ్లు ఎవరో తెలియదు. ఆయనకు చీమంత అన్యాయం కూడా చేయలేదు. వివేకా బతికున్నప్పుడు ఆయన ఇంటివద్ద రంగన్నను చూసి ఒకే ఒక్కసారి ఎవరు నువ్వు? అని అడిగితే.. తాను కాపలాదారుని అని ఆయన చెప్పారు. వివేకా నా పాలిట దేవుడు. హత్య జరిగిన రోజు రాత్రి వివేకా నన్ను మా ఇంటివద్ద దింపి వెళ్లిపోయారు. మర్నాటి ఉదయం వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ఆయన బావమరిది శివప్రకాశ్‌రెడ్డి చెబితేనే నాకు తెలిసింది’ అని గంగిరెడ్డి అన్నారు.


చంపుతానని బెదిరించారు: రంగన్న

‘నేనెవరో తెలియదని గంగిరెడ్డి అంటే దానికి నేనేం చెప్పగలను’ అని కాపలాదారు రంగన్న అన్నారు. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు హామీ ఇవ్వటంతోనే గంగిరెడ్డి చంపుతానని బెదిరించిన విషయాన్ని వారికి చెప్పానన్నారు. మీడియా ప్రతినిధులతో రంగన్న మాట్లాడుతూ.. ‘గంగిరెడ్డి వివేకా ఇంటికి తరచూ వచ్చేవారు. ఆయన లేనిదే వివేకా ఎక్కడికీ వెళ్లరు. హత్య జరిగిన రోజు నేను వివేకా ఇంటిబయటే నిద్రపోతున్నా. హత్య ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. నాకు భయం వేయటంతో ఎవర్నీ చూడలేదు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందని సీబీఐ అధికారులు నన్ను అడిగారు. సీబీఐ అధికారులు విచారణ కోసం ఆదివారం నన్ను కడపకు రమ్మన్నారు’ అని అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని