మాకు 27 టీఎంసీలు కావాలి

ప్రధానాంశాలు

మాకు 27 టీఎంసీలు కావాలి

కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తాగు, సాగు నీటి అవసరాలకు, చెన్నై తాగునీటి అవసరాలకు 27 టీఎంసీలు అవసరమని, ఈ నీరు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగుగంగ కింద 7 టీఎంసీలు, గాలేరు-నగరి-ఎస్‌ఆర్‌బీసీకి 8 టీఎంసీలు, కేసీ కాలువ కింద 2 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కింద 7 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఆ లేఖలో ఈఎన్‌సీ ఇంకా ఇలా రాశారు...

తెలంగాణ 82.40 టీఎంసీల వినియోగం

* తెలంగాణ ఇప్పటికే 82.40 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. శ్రీశైలం నుంచి 43.25 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 27.23 టీఎంసీలు, పులిచింతల నుంచి 11.92 టీఎంసీలు విద్యుత్తు వినియోగం కోసం ఏకపక్షంగా వాడేసింది. దిగువన ఎలాంటి సాగునీటి, తాగునీటి అవసరాలు, డిమాండ్‌ లేకముందే ఈ నీటిని వాడుకుంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి లేకుండా, వారికి తెలియజేయకుండా వినియోగించుకుంది.

* తెలంగాణ వినియోగించుకున్న ఈ 82.40 టీఎంసీలను ఆ రాష్ట్రానికి ఉన్న 299 టీఎంసీల నుంచి మినహాయించాలి. కృష్ణాలో నీటిని ఏపీ, తెలంగాణలు 66.34 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఆ లెక్కన ఇప్పటికే తెలంగాణ ఎలాంటి అనుమతి లేకుండా వినియోగించిన 82.40 టీఎంసీలకు సరిసమానంగా ఏపీ 160 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నీరు వాడుకునేందుకు మాకు హక్కు కల్పిస్తారా?


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని