అభిమాన నేతకు హరిత జోత

ప్రధానాంశాలు

అభిమాన నేతకు హరిత జోత

కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన
రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణ
మంత్రికి శుభాకాంక్షల వెల్లువ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉదయమే కేటీఆర్‌ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌, శోభల ఆశీర్వాదం పొందారు. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీశ్‌రావు కేటీఆర్‌కు శుభాభినందనలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని హరీశ్‌ ఆకాంక్షించారు. పలువురు మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, క్రీడాకారులు,  సినీ ప్రముఖులు, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మ్యాన్‌, బ్రిటన్‌ ఉప హైకమిషనర్‌ అండ్రూఫ్లెమింగ్‌, డీజీపీ, సీఎస్‌సహా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కేటీఆర్‌ నాకొక్కరికే సూపర్‌ స్టార్‌ కాదు.. తెలంగాణ రాష్ట్రానికి పుట్టుకతోనే సూపర్‌ స్టార్‌. ఆయన దార్శనికత మిలియన్ల మందికి స్ఫూర్తి. కేటీఆర్‌ను హత్తుకోవాలని ఆత్రుతగా ఉంది’’ అని సినీనటుడు సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణ సాధన కోసం సాగించిన ఉద్యమాల నుంచి రాష్ట్ర మంత్రి బాధ్యతల వరకు కేటీఆర్‌ నాయకత్వ పటిమను కనబరుస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన చేపట్టడం పర్యావరణ హితం. ప్రజాసేవలో కేటీఆర్‌ మరెన్నో విజయాలు సాధించాలి’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో.. 

తెలంగాణ భవన్‌లో 44 కిలోల కేక్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు కట్‌ చేశారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఒక దివ్యాంగునికి మూడు చక్రాల మోటారు వాహనాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌లలో ఎమ్మెల్యేలు కృష్ణారావు, గోపీనాథ్‌ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

* ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన నిరుపేద వృద్ధ దంపతులు రాగం మల్లయ్య, పోసక్కలకు సొంత ఖర్చులతో స్థలం కొని అందులో ఇంటిని నిర్మించి ఇచ్చారు.

* పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మొక్కలు నాటారు. ఐదుగురు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో దివ్యాంగులకు ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 105 ద్వి, త్రిచక్ర వాహనాలను నెల రోజుల్లోపు అందజేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మొక్కలు..

కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన రూపకర్త, ఎంపీ సంతోష్‌కుమార్‌ రామగుండంతోపాటు పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మొక్కలు నాటినట్లు సమాచారం అందిందని ఆయన శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది సాధారణ విషయం కాదంటూ ఈ క్రతువులో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం మొక్క నాటారు. మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కేటీఆర్‌ అభిమానులు, ప్రభుత్వ కార్యాలయాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. గోషామహల్‌ నియోజకవర్గంలో 5వేల మొక్కలను నాటారు. ఆదిత్య కృష్ణా చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వాటికి గార్డులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో దండుమల్కాపూర్‌లో 4వేల మొక్కలను నాటారు. సింగరేణి శనివారం ఒకే రోజున 5లక్షల మొక్కలు నాటింది. అటవీశాఖ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో 50లక్షలకుపైగా మొక్కలు నాటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను అడవిలోకి తీసుకెళ్లి మొక్కలు నాటించారు. గెజిటెడ్‌ అధికారుల సంఘం, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అమెరికా, న్యూజిలాండ్‌, కువైట్‌ తదితర దేశాల్లో తెరాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

అందరికీ కృతజ్ఞతలు: కేటీఆర్‌ 

తనకు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ముక్కోటి వృక్షార్చన, సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించిన వారందరికీ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానం కలకాలం ఉండాలని, ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని ఆకాంక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని