పీపీఏల నుంచి వెనక్కి

ప్రధానాంశాలు

పీపీఏల నుంచి వెనక్కి

మూడు ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ఆపాలని నిర్ణయం

విద్యుత్‌ ఒప్పందాలను సమీక్షించిన డిస్కంలు

రూ.450 కోట్ల ఆదా అవుతుందని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నుంచి వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటును తెలంగాణ డిస్కంలు వినియోగించుకోదలిచాయి. రామగుండంలోని రెండు ప్లాంట్లు, నైవేలి లిగ్నైట్‌లోని ఒక ప్లాంటు నుంచి ప్రస్తుతం 481 మెగావాట్ల విద్యుత్తును కొంటున్నారు.  ఈ మూడు ప్లాంట్ల నుంచి కొనుగోలును విరమించుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. దీనివల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.450 కోట్లు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇకపై తమకు అందుబాటులో ఉన్న తెలంగాణ జెన్‌కో ప్లాంట్ల నుంచి కరెంటు కొనాలని డిస్కంలు భావిస్తున్నాయి. పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)ల నుంచి వైదొలిగేందుకు అవసరమైన చర్యలను అధికారులు ప్రారంభించారు. ముందుగా విద్యుత్‌ నియంత్రణ మండలికి సమాచారం అందించటం, ఆరు నెలల ముందుగా నోటీసు పంపటం వంటి ప్రక్రియలు చేపట్టారు.

ఖర్చులు, ఛార్జీలు భారమని..

థర్మల్‌ కేంద్రాలతో ఒప్పందాలు పూర్తయి 25 సంవత్సరాలు పూర్తయితే కొనుగోలు నుంచి విరమించుకోవచ్చని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. దీంతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు పరిస్థితిని సమీక్షించాయి. రానున్న రోజుల్లో పెరుగుతున్న యూనిట్‌ ధరలను అంచనా వేసుకున్నాయి. విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే సెంటర్‌ గ్రిడ్‌ నుంచి తెచ్చుకోవాలి. దీనికి తప్పనిసరిగా పవర్‌గ్రిడ్‌కు ఛార్జీలు (పీజీసీఐఎల్‌) చెల్లించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఛార్జీల నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలుదారులకు మినహాయింపు ఇచ్చింది. దీంతో థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలుదారులపై ఆ భారం పడుతోంది. యూనిట్‌కు 30 నుంచి 40పైసలు అధికంగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా కాలుష్య నివారణ కోసం ఫ్లూ గ్యాస్‌ డీ సల్ఫ్యూరైజేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. ఇందుకు ఆయా కేంద్రాలు భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ ఖర్చు కూడా కలిస్తే యూనిట్‌పైన మరో 40పైసలు అధికంగా చెల్లించవలసి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు  తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని