లాహే లాహే లాహేలే.. శ్రీశైలం నిండెనులే..

ప్రధానాంశాలు

లాహే లాహే లాహేలే.. శ్రీశైలం నిండెనులే..

సాగర్‌కు 1.20 లక్షల క్యూసెక్కుల విడుదల

ఈనాడు హైదరాబాద్‌: శ్రీశైలం గేట్లు తెరుచుకోవడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్‌ వైపు పరుగెత్తుతోంది. గత వారం రోజులుగా ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యాంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రాజెక్టు అధికారులు బుధవారం సాయంత్రం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అటు కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా, ఇటు గేట్ల ద్వారా రాత్రి ఏడుగంటల సమయంలో 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లించారు. గురువారం ఉదయానికి నీటి విడుదలను మరింత పెంచనున్నారు. 2007 జులై ఆరంభంలోనే శ్రీశైలం నిండి దిగువకు నీటిని వదలగా, ఇప్పుడు జులై ఆఖరు వారంలో వదిలారు. ఆలమట్టిలోకి బుధవారం కూడా భారీ ప్రవాహం వచ్చింది. 4.13 లక్షల క్యూసెక్కులు రాగా, 3.8 లక్షల క్యూసెక్కులు విడిచిపెట్టారు. జూరాల నుంచి 3.8 లక్షల క్యూసెక్కులు వదలడంతోపాటు తుంగభద్ర నిండటంతో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ రెండింటి నుంచి వచ్చే నీటితో శ్రీశైలంలోకి 4.5 లక్షల క్యూసెక్కులకు పైగా చేరనుంది. డ్యాం నిర్వహణలో భాగంగా 880 అడుగులకు పైన జులై ఆఖరులోనే నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నిండటానికి మరో 120 టీఎంసీలు మాత్రమే అవసరం. శ్రీశైలంలోకి ఇదే ప్రవాహం మరో మూడు రోజులపాటు కొనసాగితే సాగర్‌ కూడా నిండే అవకాశాలు ఉన్నాయి. పులిచింతలలో పూర్తిస్థాయిలో నిల్వ ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే రెండు రాష్ట్రాలు కాలువలు, లిప్టుల ద్వారా విడుదల చేసే నీరు కాకుండా మిగిలినదంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టాల్సిన పరిస్థితి. గోదావరి బేసిన్‌లో కూడా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని