సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ఫీజుల మోత

ప్రధానాంశాలు

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ఫీజుల మోత

బీటెక్‌లో రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంపు
ఎంకాం ఫీజు రూ.13 వేల నుంచి రూ.22.5 వేలకు...

కోర్సుల వారీగా కనీస ఫీజు నిర్ణయించిన విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అందించే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. కోర్సులను బట్టి 20-100 శాతం వరకూ రుసుములు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం రాత్రి మార్గదర్శకాలతో జీఓను జారీ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వ వర్సిటీల్లో రెగ్యులర్‌ బీటెక్‌ కోర్సు ఫీజు ఏడాదికి రూ.18 వేలు ఉండగా.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35 వేలు వసూలు చేస్తున్నారు. తాజాగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. 29 శాతం పెంచారు. ఎంటెక్‌ ఫీజు రూ.50 వేల నుంచి 90 వేలకు పెరగగా.. ఎంఆర్క్‌ ఫీజు రూ.70 వేల నుంచి రూ.90 వేలకు పెరిగింది. అలానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎంకాం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు ఫీజును రూ.13 వేల నుంచి రూ.22.5 వేలకు, ఎంఎస్‌సీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజును రూ.21,300 నుంచి రూ.30 వేలకు పెంచారు.
పెంచిన ఫీజులను గరిష్ఠం అని కాకుండా కనీస ఫీజుగా విద్యాశాఖ పేర్కొంది. అంటే పెంచిన మొత్తం సరిపోకుంటే ఇంకా పెంచుకోవచ్చన్నది ఉద్దేశం.  తాజా జీఓను విశ్వవిద్యాలయాలు పాలకమండలి(ఈసీ) సమావేశాల్లో పెట్టి ఆమోదం తీసుకొని అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా దాదాపు అన్ని చోట్లా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ కోర్సులే నడుస్తున్నాయి. ఓయూ పరిధిలోని నిజాం, కోఠి (మహిళ), ఇతర పీజీ కళాశాలలతోపాటు అన్ని వర్సిటీల పరిధిలో వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఈ కోర్సులు నడపడం ఆర్థికంగా ఇబ్బంది అనుకుంటే కళాశాలలు వాటిని మూసివేయవచ్చు. 50 శాతం విద్యార్థులు చేరకున్నా.. ఆయా కోర్సులను రద్దు చేయాలి.

జీతాల నిర్దేశంలో భాగంగా రుసుముల పెంపు

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల విద్యార్థులు చెల్లించే ఫీజులను ఈ కోర్సు అధ్యాపకుల వేతనాలు, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తారు. ఈ కోర్సుల్లో పనిచేసే కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకుల జీతాల పెంపులో భాగంగా తాజాగా రుసుములను పెంచారు. ప్రస్తుతం రెగ్యులర్‌ కోర్సుల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు బోధించే అధ్యాపకులకు వేతనాల్లో తేడా ఉంది. తమకూ కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మూడేళ్ల నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. వేతనాల పెంపుపై ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించారు. ఈ క్రమంలో నెట్‌/టీఎస్‌సెట్‌ అర్హత ఉన్న వారికి రూ.42 వేలు, వాటికి అదనంగా పీహెచ్‌డీ ఉంటే మరో రూ.3 వేలు చెల్లించాలని, ఇతరులకు రూ.36 వేల వేతనం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సీనియర్‌ అధ్యాపకుల్లో ఆందోళన!

ఇప్పటివరకు సెల్ఫ్‌ఫైనాన్స్‌ అధ్యాపకులకు నెట్‌/టీఎస్‌సెట్‌ లాంటి అర్హతలుంటే రూ.24,840, ఆ అర్హతలు లేని వారికి రూ.21,600 వేతనం చెల్లిస్తున్నారు. బోధనానుభవాన్ని బట్టి ఏటా 3 శాతం పెంపును అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం కొందరు రూ.55 వేల వరకు వేతనాన్ని అందుకుంటున్నారు. ఇప్పుడు రూ.36 వేల నుంచి రూ.42 వేలు వేతనంగా నిర్ణయించడంతో.. ఎక్కువ వేతనం తీసుకునే వారికి తగ్గిస్తారా? అన్న ఆందోళన అధ్యాపకుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఈ అధ్యాపకుల ఉద్యోగం ఏటా ఆటో రెన్యువల్‌ అయ్యేది. తాజా జీఓ ప్రకారం ఏటా ఆయా ఉద్యోగాలను రెన్యువల్‌ చేయాలి. అంటే ప్రతి ఏటా కొలువు ఉంటుందో? లేదో? అనే ఆందోళన తప్పకపోవచ్చన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని