రాజధానిలో సిరి సంపదలు

ప్రధానాంశాలు

రాజధానిలో సిరి సంపదలు

చిరుధాన్యాల అంతర్జాతీయ హబ్‌గా హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా అందించే చిరుధాన్యాల పంటల సాగు, వాటి ఉత్పత్తులను పెద్దఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా నిర్ణయించింది. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు, కొర్రలు, అరికెలు, వరిగల పంటలను చిరు లేదా తృణధాన్యాలుగా పిలుస్తారు. వీటిలో అనేక పోషకాలు ఉన్నాయని ఇక్రిశాట్‌, ఐఐఎంఆర్‌లు గుర్తించాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో గల ‘భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ’(ఐఐఎంఆర్‌)ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల పరిశోధన హబ్‌’గా మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి 2023ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. అప్పటికల్లా దేశంలో పండే తృణధాన్యాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండు, విలువ పెరిగి ఇక్కడి రైతులకు ఆదాయం రెట్టింపు చేయవచ్చని, తద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేయాలనేది లక్ష్యం. కేంద్ర వ్యవసాయశాఖ, నీతి ఆయోగ్‌, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌), ఐఐఎంఆర్‌ అధికారులు, శాస్త్రవేత్తలు అంతర్గతంగా నిర్వహించిన ఆన్‌లైన్‌లో సమావేశంలో అంతర్జాతీయ హబ్‌ ఏర్పాటు, దానివల్ల కలిగే ప్రయోజనాలపై చర్చించారు. కేంద్రం అధికారికంగా ఆమోదించిన తరవాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని