సృజనతోనే మాతృభాష వికాసం

ప్రధానాంశాలు

సృజనతోనే మాతృభాష వికాసం

  ఈ దిశలో ప్రజా ఉద్యమం రావాలి అనువాదాలతో భాష విశ్వవ్యాప్తం

  ‘తెలుగు కూటమి’ అంతర్జాల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, హైదరాబాద్‌: మాతృభాషను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాలపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మాతృభాషను విస్మరిస్తే గుర్తింపు, గౌరవాన్ని కోల్పోతామని ఆయన హెచ్చరించారు. ‘తెలుగు కూటమి’ సంస్థ శనివారం నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణతోపాటు భావితరాలకు వారసత్వంగా అందించడం ప్రజా ఉద్యమంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మాతృభాష సంరక్షణకు ఐదు సూత్రాలను ఆయన పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య అందేలా చూడడం, పరిపాలన భాషగా ప్రాధాన్యం ఇవ్వడం, న్యాయస్థానాల్లో కార్యకలాపాలతో పాటు తీర్పులు వెల్లడించడం, సాంకేతిక విద్యలో క్రమంగా వినియోగాన్ని పెంచడం, ప్రతి ఇంట్లో తల్లి భాషలోనే మాట్లాడుకోవడం ప్రధానమన్నారు. 

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చొరవ భేష్‌

‘ఇటీవల సుప్రీంకోర్టులో ఆంగ్లంలో తన సమస్యను చెప్పలేక ఇబ్బంది పడుతున్న మహిళకు మాతృభాష తెలుగులో మాట్లాడే అవకాశమిచ్చి భార్యాభర్తల వివాదాన్ని పరిష్కరించిన దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చొరవకు అభినందనలు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యను మాతృభాషలో తెలియజేసే అవకాశం ఉండాలి. ఉత్తమ భాషా విధానం కీలకమన్న యునెస్కో తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించాలి.  మాతృభాషల రక్షణకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నాలు ముదావహం’ అని ఆయన అభినందించారు. భాష పరిరక్షణలో ప్రాంతీయ పత్రికల పాత్ర కూడా కీలకమని గుర్తుచేశారు. ‘ఏ భాష అయినా విశ్వవ్యాప్తం కావడానికి అనువాదాలు దోహదపడతాయి. ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి వస్తున్నట్టు తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి తర్జుమా కావడం లేదు. ఈ దిశలో తెలుగువారంతా చొరవ చూవాలి. మాతృభాషలో బలమైన పునాది వేసుకోవడంతో పాటు సోదర భాషలనూ అధ్యయనం చేయాలి’ అని వెంకయ్య నాయుడు సూచించారు. తెలుగు భాష పరిరక్షణను తమ సంస్థ ఉద్యమంలా చేపట్టిందని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, విశ్రాంత ఉన్నతాధికారులు ముక్తేశ్వరరావు, ఆంజనేయరెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్‌ నందిని సిదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని