24 గంటలు... 32 టీఎంసీలు

ప్రధానాంశాలు

24 గంటలు... 32 టీఎంసీలు

 వేగంగా నిండుతున్న నాగార్జునసాగర్‌

ఈనాడు, హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: శ్రీశైలం నుంచి వచ్చి చేరుతున్న జలాలతో నాగార్జునసాగర్‌  నిండుకుండలా మారుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 264.85 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.90 అడుగులు ఉంది. శుక్రవారం జలాశయంలో నిల్వ 232.61 టీఎంసీలు ఉండగా 24 గంటల్లో మరో 32.24 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 36,484 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి ఎగువ నుంచి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా  4.54 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి 4.20 లక్షలు, నారాయణపూర్‌ నుంచి 4.14 లక్షలు, జూరాల నుంచి 4.84 లక్షలు, తుంగభద్ర నుంచి 58 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహంలో పెద్దగా మార్పులు లేవు. 

అప్రమత్తంగా ఉన్నాం: ఎన్నెస్పీ సీఈ

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరద నీటిరాక నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని ఎన్నెస్పీ సీఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. ఇటీవల మరమ్మతులు నిర్వహించిన సాగర్‌ డ్యాం క్రస్టుగేట్లను శనివారం ఆయన పరిశీలించారు. గేట్ల నుంచి లీకేజీని పూర్తిగా నిరోధించామని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో ఇదేవిధంగా కొనసాగితే రెండు రోజుల్లో సాగర్‌ జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుతుందని.. అలా చేరిన వెంటనే నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు. సాగర్‌ ఎడమ కాల్వకు ఆగస్టు 13 నుంచి నీటిని విడుదల చేయడానికి షెడ్యూల్‌ ఖరారు చేస్తామని, జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు కోరితే ఇంకా ముందుగానే విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సాగర్‌ ఎస్‌ఈ ధర్మ, డీఈ పరమేష్‌, జేఈ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని