అమ్మ కడుపు హాయిగా

ప్రధానాంశాలు

అమ్మ కడుపు హాయిగా

కాన్పు కోతలకు అడ్డుకట్ట

సహజ ప్రసవాలపై నర్సులకు ప్రత్యేక శిక్షణ

8 ఆసుపత్రుల్లో సానుకూల ఫలితాలు

గతేడాదితో పోల్చితే 3 నెలల్లో 10 శాతం వరకూ తగ్గిన సిజేరియన్లు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో కాన్పు కోతలను నివారించడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ‘మిడ్‌వైఫరీ నర్సింగ్‌’ శిక్షణకు ప్రాధాన్యమిస్తోంది. ప్రయోగాత్మకంగా 11 ఆసుపత్రులను ఎంపిక చేసి.. వాటిలో సుమారు 219 మంది మిడ్‌వైఫరీ నర్సులను నియమించింది. వీరితో పాటు ఈ ఆసుపత్రులకు సమీపంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లోని నర్సులకూ సహజ ప్రసవాలపై శిక్షణ ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాచలం, మహబూబాబాద్‌, గోదావరిఖని, ఏటూరునాగారం, కాగజ్‌నగర్‌ ఆసుపత్రుల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వెల్లడించారు. 2020-21 ఏప్రిల్‌- జూన్‌ మాసాల్లో నమోదైన కాన్పు కోత (సిజేరియన్‌)లతో పోల్చితే.. 2021-22లో ఇవే నెలల్లో దాదాపు 10 శాతం వరకూ తగ్గాయని పేర్కొన్నారు.

సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యంగా..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కలిపి సగటున 60.7 శాతం కాన్పు కోతలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో అధికంగా 82.4%, కుమురం భీం జిల్లాలో తక్కువగా 27.2% నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున 44.5% కాన్పు కోతలు జరుగుతుండగా.. అత్యధికంగా జనగామ జిల్లాలో 73% నమోదైంది. రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 48.6, జగిత్యాలలో 64.9, కరీంనగర్‌లో 66.8 శాతం సిజేరియన్లు నమోదయ్యాయి. వీటిని తగ్గించే లక్ష్యంతోనే నర్సులకు శిక్షణ ఇస్తున్నారు.


ప్రసవానికి ముందు వరకూ వ్యాయామాలు

కాన్పు సమయంలో ముప్పు అధికంగా ఉన్నవారు ఏ ఆసుపత్రికి వెళ్లాలి? సహజ ప్రసవానికి ఎటువంటి ఆటంకాలు లేనివారు ఏ ఆసుపత్రికి వెళ్లాలో నర్సులు ముందే సూచిస్తారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రిలో ప్రసవానికి ముందు వరకూ వ్యాయామాలు చేయిస్తారు. పురుడు సమయంలో పక్కనే భర్త లేదా కుటుంబ సభ్యులు ఉండేలా ప్రోత్సహిస్తున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని