కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదు

ప్రధానాంశాలు

కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదు

మంత్రిమండలి సిఫారసును పరిశీలిస్తున్నా
సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలే ఉన్నాయి
గవర్నర్‌ తమిళిసై వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస నేత కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు. ఆయనను సామాజిక సేవల విభాగం కింద ఎమ్మెల్సీగా నియమించాలని మంత్రిమండలి సిఫారసు చేసి తనకు పంపిందని తెలిపారు. ఆ కేటగిరీకి ఆయన సరిపోతారా లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విధి నిర్వహణ అనుభవాలపై రూపొందించిన ‘ప్రజల్లో ఒకరు’ పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు.  ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రశ్నించగా.. అది పెండింగులో ఉందని చెప్పారు. గతంలో ముగ్గురిని నామినేటెడ్‌ కోటాలో ప్రభుత్వం సిఫారసు చేయగా.. వెంటనే ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించగా.. వారు కళలు, సామాజిక సేవల విభాగంలో ఉన్నందున ఆమోదం తెలిపానని చెప్పారు. కౌశిక్‌రెడ్డికి సంబంధించిన సిఫారసుపై అధ్యయనం చేస్తున్నామని, మరికొంత సమయం పడుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో తనకు ఎలాంటి వివాదాలు కానీ, విభేదాలు కానీ లేవని, సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయని చెప్పారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం గిరిజనుల మధ్య రెండో డోసు వేసుకున్నాను. వ్యవసాయంలో తెలంగాణ ఘనమైన ప్రగతిని సాధిస్తోంది. దేశానికే ధాన్యాగారంగా మారింది’’ అని గవర్నర్‌ తెలిపారు.

కరోనా తగ్గాక ప్రజాదర్బార్‌

రెండేళ్ల పదవీకాలం ఎంతో సంతృప్తినిచ్చిందని తమిళిసై తెలిపారు. కరోనా తగ్గాక ప్రజాదర్బార్‌ నిర్వహించి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గిరిజన జిల్లాలను సందర్శిస్తానని చెప్పారు. వ్యాధులు, వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు బాగుందని ప్రశంసించారు. తెలంగాణలో టీకాల ప్రక్రియను వేగంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. వసతులు మరింత పెంచాలని సూచించారు. ‘‘ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు మూడు జిల్లాల్లో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులు, రాజ్‌భవన్‌ అన్నం, టెలి మెడిసిన్‌ వంటి అంశాలు వ్యక్తిగతంగా సంతోషాన్నిచ్చాయి. ఉన్నత విద్యలో విలువలు పెంచేందుకు వీసీలతో తరచూ చర్చిస్తున్నాను’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని