18 మందికి మొదటి ర్యాంకు

ప్రధానాంశాలు

18 మందికి మొదటి ర్యాంకు

వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు... ఏపీ నుంచి నలుగురు
ఒకే ర్యాంకు పలువురికి కేటాయించడం ఇదే తొలిసారి
జేఈఈ మెయిన్‌ ర్యాంకుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌లో దేశవ్యాప్తంగా ఈసారి ఏకంగా 18 మందికి ప్రథమ ర్యాంకు దక్కింది. వారిలో మూడో వంతు...అంటే ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులున్నారు. నాలుగు విడతలుగా జరిగిన పరీక్షల్లో మొత్తం 44 మందికి 100 పర్సంటైల్‌(ఎన్‌టీఏ స్కోర్‌) దక్కినా వారిలో 18 మందికి ప్రథమ ర్యాంకు కేటాయించారు. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ ర్యాంకులను బుధవారం ఉదయం వెల్లడించింది. ఈసారి తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, మాదుర్‌ ఆదర్శ్‌రెడ్డి, ఏపీ నుంచి దుగ్గినేని వెంకటపనీష్‌, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్‌నాయుడు, కరణం లోకేష్‌ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన జోస్యుల వెంకట ఆదిత్యకు రెండో ర్యాంకు వచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతానికి భిన్నంగా రెండు సార్లు బదులు నాలుగు విడతలుగా ఈసారి పరీక్షలు నిర్వహించారు. గత ఫిబ్రవరి, మార్చి, జులై నెలలతో పాటు ఆగస్టు/సెప్టెంబరులో పరీక్షలు జరిపారు. విద్యార్థులు రాసిన పరీక్షల్లో అత్యధిక స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకుల ద్వారా ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఐఐటీల్లో చేరాలంటే అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ర్యాంకర్లందరూ వచ్చే నెల 3న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కానున్నారు. జేఈఈ మెయిన్స్‌ నాలుగు విడతలుగా జరగ్గా దేశవ్యాప్తంగా 10.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 9.39 లక్షల మంది పరీక్ష రాశారు.

అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుకు 20 వరకు గడువు

జేఈఈ మెయిన్‌లో ఎంత మంది రాసినా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు 2.50 లక్షల మందికే అవకాశం ఇస్తారు. వీరు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రారంభించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని