ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా

ప్రధానాంశాలు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా

పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు రద్దు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. లెక్కింపు సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), మరికొందరు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతించింది. అప్పీళ్లు పరిష్కారమయ్యే వరకు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళి (కోడ్‌) విధించే అంశాన్ని.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అమలు చేశారని అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషనర్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయడాన్ని సింగిల్‌ జడ్జి తప్పుపట్టారని గుర్తుచేసింది. అప్పిలేట్‌ కోర్టును ఆశ్రయించడాన్ని విమర్శించడానికి వీల్లేదని తెలిపింది. జనసేన వేసిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించకపోవడంపై వాదనలు చెప్పలేదని పేర్కొంది. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు, సమయం ఉన్నప్పుడు ఏప్రిల్‌ 1న ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ వల్ల కొందరి హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది.  సింగిల్‌ జడ్జి తీర్పును తాము రద్దు చేసిన నేపథ్యంలో ఆ తీర్పులోని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని