శ్రీవారి భక్తుల్లో గుబులు!

ప్రధానాంశాలు

శ్రీవారి భక్తుల్లో గుబులు!

 పాలక మండలిలో ప్రత్యేక  ఆహ్వానితులతో కలిపి సంఖ్య భారీగా పెరగడంతో కొత్త చిక్కులు

వారికిచ్చే దర్శన, సేవా టికెట్లలో కోత పెట్టాలి

లేదంటే సామాన్యులకు దర్శనం కష్టం!

ఈనాడు, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన తితిదే ధర్మకర్తల మండలి జాబితా.. సామాన్య భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 81 మందిని నియమించడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరందరికీ దర్శన టికెట్లిచ్చే అధికారం కల్పిస్తే రోజూ సుమారు 2వేల వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు 2,400 కేటాయించొచ్చు. అప్పుడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత కష్టంగా మారుతుందని.. బోర్డు సభ్యులు, ప్రత్యేకాహ్వానితులకు బ్రేక్‌, ఆర్జిత సేవల టికెట్ల కేటాయింపులో కోత పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న జాబితా

తెదేపా హయాంలో తితిదే ఛైర్మన్‌ సహా 14 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉండేవారు. వైకాపా హయాంలో ఛైర్మన్‌ సహా 25 మంది బోర్డు సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. బుధవారం ప్రకటించిన జాబితాలో ఆ సంఖ్య రెట్టింపు కంటే పెరిగి 81కి చేరింది. ఇందులో బోర్డు తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరిని నియమించారు. వీరికి బోర్డు సమావేశాల్లో ఓటింగ్‌ హక్కు తప్ప బోర్డు సభ్యులకు ఉండే మిగిలిన అధికారాలన్నీ ఉంటాయి. అదనంగా తితిదే తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని తీసుకున్నారు. వీరు బోర్డు పరిధిలోకి రారని చెబుతున్నా.. దర్శన టికెట్లు కేటాయించే అధికారం కల్పించే అవకాశాలున్నాయి. అదే జరిగితే సామాన్యులకు దర్శనం మరింత సమస్యగా మారనుంది. 

వేల టికెట్లు వీరి ఖాతాలోనే..

కొవిడ్‌కు ముందు ఒక్కో బోర్డు సభ్యుడు భక్తులకు స్వామి దర్శనానికి నాలుగు సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఒక్కో లేఖలో ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్కో సభ్యుడు రోజుకు 24 మందికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించొచ్చు. శుక్ర,శని, ఆదివారాల్లో రెండు నుంచి మూడు లేఖలు ఇచ్చేవారు. ఈ లెక్కన ఇప్పుడు ఛైర్మన్‌ మినహా మిగిలిన 80 మంది సిఫార్సు లేఖలను అంగీకరిస్తే సాధారణ రోజుల్లో రోజుకు 1,920 మంది, వారాంతాల్లో 960 మందికి వీఐపీ బ్రేక్‌ టికెట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో భక్తులు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైన వాటికి తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలి. ఇవి కాకుండా సాధారణంగా సుపథం ద్వారా ఒక్కొక్కరు రూ.300 టికెట్లు రోజుకు 30 వరకు కేటాయించొచ్చు. 80 మంది సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులే సుపథం ద్వారా 2,400 టికెట్లు కేటాయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు దర్శనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విమర్శించారు. బ్రహ్మోత్సవాలు, ముఖ్య పర్వదినాల్లో శ్రీవారి వాహనాల ముందు సభ్యుల పరివారం తప్ప మిగిలినవారెవరికీ అవకాశమే ఉండదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆహ్వానితుల నియామక ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతో నడుస్తున్న ధార్మిక సంస్థ తితిదేపై రాజకీయ రంగు రుద్దడం శోచనీయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తితిదే బోర్డు ఏర్పాటులో ప్రభుత్వ తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విమర్శించారు. ఇప్పుడున్న వారికే ప్రొటోకాల్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, తాజాగా సభ్యులు, ఆహ్వానితుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు మరింత పెరుగుతాయని కొందరు అధికారులు వాపోతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని