పిల్లల్లో కొవిడ్‌ తీవ్రత తక్కువ

ప్రధానాంశాలు

పిల్లల్లో కొవిడ్‌ తీవ్రత తక్కువ

అయిదేళ్లలోపు బాలల్లో బాధితులు 1.8 శాతమే

99.8 శాతం మరణాలు 15 ఏళ్లు పైబడిన వారిలోనే

ఏడాదిలోపు శిశువుల్లో మాత్రం ముప్పు తీవ్రం

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడి 

ఈనాడు - హైదరాబాద్‌

పిల్లల్లో కొవిడ్‌ వ్యాప్తి, సోకాక తలెత్తే తీవ్రత.. రెండూ తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే.. మొత్తం బాధితుల్లో అయిదేళ్లలోపు చిన్నారులు 1.8 శాతం మాత్రమేనని తేల్చిచెప్పింది. చిన్నారుల్లో తక్కువ కేసులు నమోదవుతుండగా.. వయసు పెరుగుతున్న కొద్దీ కేసుల వృద్ధీ కనిపిస్తోందని విశ్లేషించింది. వైరస్‌ బాధితుల్లో 6-14 ఏళ్ల వయసు వారు 6.2 శాతం మంది ఉండగా, 15-24 ఏళ్ల మధ్యవయసు వారు ఏకంగా 14.3 శాతం మంది ఉన్నట్లు వెల్లడించింది. చిన్నారుల్లో మరణాలూ తక్కువగానే నమోదయ్యాయనీ, మొత్తంగా 99.8 శాతం మరణాలు 15 ఏళ్ల పైబడిన వారిలోనే రికార్డయ్యాయని తెలిపింది. ఏడాదిలోపు శిశువుల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువే అయినా.. సోకితే మాత్రం ముప్పు తీవ్రత కాస్త అధికంగా ఉంటోందని హెచ్చరించింది. అందులోనూ 0-28 రోజుల్లోపు నవజాత శిశువుల్లో మరీ అధిక ముప్పునకు అవకాశాలున్నాయంది. ‘పిల్లల్లో కొవిడ్‌’ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 30 డిసెంబరు 2019 నుంచి 6 సెప్టెంబరు 2021 వరకూ ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ కేసుల సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించింది. ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారివి కలిపి మొత్తం కొవిడ్‌ కేసులు 9,00,11,040 కాగా.. మొత్తం మరణాలు 17,52,008గా నమోదయ్యాయి.

లక్షణాల్లేని వారే అధికులు

చిన్నారులు అత్యధికుల్లో సాధారణ జలుబు, దగ్గు వంటివి తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించడం లేదు. అందుకే పిల్లల్లో పరీక్షలు చేయించడం లేదని, ఇందువల్లే వారిలో కొవిడ్‌ కేసుల నమోదు సంఖ్య స్వల్పంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో విశ్లేషించింది. పెద్దల్లో మాదిరిగా పిల్లలను కొవిడ్‌ చికిత్స అనంతరం దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా తొమ్మిదేళ్లు పైబడిన వారిలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ. పెద్దవారిలో వైరస్‌ వ్యాప్తితో పోల్చితే.. 9 ఏళ్ల లోపు చిన్నారుల ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువేనని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయిదేళ్లలోపు వయసు వారికి మాస్కు అక్కర్లేదనీ, అంతకు పైబడిన వయసు వారికి అది తప్పనిసరని స్పష్టీకరించింది.


ఉపాధ్యాయులు టీకాలు తీసుకోవాలి

తెలంగాణలో పదేళ్లలోపు చిన్నారుల్లో కరోనా కేసుల నమోదు 2.9 శాతమే. అదే 10-20 ఏళ్ల మధ్యవయస్కుల్లో అది 10.6 శాతం. పెద్దవారితో పోల్చితే పిల్లల్లో తక్కువ ప్రభావం, స్వల్ప మరణాలు నమోదయ్యాయి. తక్కువ లక్షణాలతో కొవిడ్‌ సోకినా కూడా వీరి ద్వారా వ్యాప్తికి అవకాశాలున్నాయి. పిల్లల్లో అయిదేళ్లు పైబడినవారు బడులకు వెళ్తారు. కాబట్టి తరగతి గదుల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు ధరించాలి. టీచర్లంతా టీకాలు తీసుకోవడం తప్పనిసరి చేయాలి.

- డాక్టర్‌ కిరణ్‌ మాదల, హెడ్‌, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి


పసివారిలో లక్షణాలుంటే కొవిడ్‌ పరీక్ష అవసరం

ఏడాదిలోపు శిశువుల్లో నిమోనియా, మలేరియా వంటి జబ్బుల బారినపడే అవకాశాలు అధికం. వీరికి కొవిడ్‌ సోకినా.. ఇతర ఇన్‌ఫెక్షన్లపై దృష్టిపెడుతూ కరోనా పరీక్షలు చేయించడం లేదు. అందుకే వైరస్‌ను గుర్తించడంలో జాప్యం జరిగి.. తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ఏడాదిలోపు పసివారిలో లక్షణాలు కనిపిస్తే కొవిడ్‌ పరీక్ష చేయించాల్సిన అవసరముంది. ఇప్పుడు మనవద్ద కూడా కొవిడ్‌ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయినందున పిల్లల్ని యథావిధిగా బడికి పంపించవచ్చు. 

- డాక్టర్‌ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నిలోఫర్‌ ఆసుపత్రి


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని