పాలనలో ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ పరిజ్ఞానం

ప్రధానాంశాలు

పాలనలో ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ పరిజ్ఞానం

దేశంలో తొలిసారి తెలంగాణలో వినియోగం!

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగంలో నూతన సాంకేతిక విప్లవం.. ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ను పాలన సేవల్లో వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయ స్థాయిలో పాలన, ప్రజావసరాలకు ఈ సాంకేతికతను వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. సర్వర్‌లు, స్టోరేజ్‌, డేటాబేస్‌లు, నెట్‌వర్కింగ్‌, సాఫ్ట్‌వేర్‌, అనలిటిక్స్‌ సేవలను ఇంటర్నెట్‌ ద్వారా అత్యంత వేగంగా అందించేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది. ప్రభుత్వరంగంలో దీనిని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే ప్రథమం కానుంది. సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్లు, ఫైళ్లను ఇంటర్నెట్‌లో నిల్వ చేసే స్థలం (వర్చువల్‌ స్పేస్‌)గా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గుర్తింపు పొందింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, అన్ని రకాల పరికరాల్లో పరిమితులు లేకుండా సమాచార నిల్వ, అప్లికేషన్ల వినియోగానికి ఈ సాంకేతికత ఉపకరిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచడం, ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌, సర్వర్లు అవసరం లేకుండా వినియోగించడం దీని ప్రత్యేకత. సమాచార భద్రతతో పాటు అతి తక్కువ వ్యయంతో ఆయా సేవలు అందుతాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా డిజిటల్‌ వనరులను పంచుకోవడం, నిర్వహించే సౌకర్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నాయి.

అపరిమిత సమాచారం...

ప్రభుత్వ శాఖల్లో పెద్దఎత్తున సమాచారం నిల్వ అవుతోంది. వ్యవసాయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, వైద్యఆరోగ్య, కార్మిక, రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ద్వారా కోటల మందికి సేవలందుతున్నాయి. విద్యుత్‌, పోలీసు శాఖల్లోనూ సమాచార వ్యవస్థ కీలకంగా ఉంది. ఆయా శాఖలకు కంప్యూటర్‌ ఆధారిత సేవలందుతున్నా... కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. 

మార్గదర్శకాలు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వినియోగ మార్గదర్శకాలను తాజాగా జారీ చేశారు. దీని వినియోగంపై ప్రభుత్వ శాఖల్లో చైతన్యం కల్పించాలని, ప్రతి శాఖలో విధిగా వినియోగ వసతులు, అధికారులు-ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పరిశ్రమలు, ఐటీ శాఖకు ప్రభుత్వం సూచించింది. అవసరమైన డిజిటల్‌ మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ప్రతి శాఖకు సేవాపట్టిక అందజేయాలని పేర్కొంది. ఈ సాంకేతికతపై అన్ని శాఖలకు మార్గదర్శనం చేసేందుకు ప్రత్యేకంగా ప్రతిభా కేంద్రం (క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని